విదేశీ నిపుణులకు కెనడా ఎర్ర తివాచీ పరుస్తోంది. భారతీయులు శాశ్వత నివాసి (పర్మినెంట్ రెసిడెంట్- పీఆర్) హోదా పొందటంలో అగ్రస్థానంలో నిలుస్తున్నారు. గత ఏడాది మొత్తం 3.41 లక్షల మందికి పీఆర్ ఇవ్వగా అందులో 85 వేల మందికిపైగా భారతీయులు ఉండటం విశేషం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల నేపథ్యంలో భారతీయ నిపుణులతోపాటు విదేశీ విద్యకు వెళ్లే వారి చూపు కెనడా వైపు మళ్లింది. అక్కడ వయసు మీద పడుతున్న జనాభా సంఖ్య పెరుగుతుండటంతో కొద్ది సంవత్సరాలుగా దేశంలో స్థిరపడేందుకు విదేశీయులను ఆ దేశం ప్రోత్సహిస్తోంది. ఈక్రమంలో 2015లో 2,71,835 మందికి పర్మినెంట్ రెసిడెంట్ హోదా ఇవ్వగా… 2019లో ఆ సంఖ్య 3.50 లక్షలకు పెరిగింది. 2016లో 39,340 మంది భారతీయులు పీఆర్ పొందగా…2019కి వచ్చే సరికి ఏకంగా 85,585కి చేరుకోవడం విశేషం. అంటే మూడేళ్లలోనే 117 శాతం పెరిగింది. అమెరికాలో హెచ్1బీ వీసాలు పొందటం కష్టంగా మారటం… రెన్యువల్ సమస్యగా ఉండటం…అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు… అభద్రతాభావం… హెచ్1బీ వీసా కోసం పోటీపడే వారి సంఖ్య ప్రతి సంవత్సరం అధికమవుతుండటం తదితర కారణాల వల్ల భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులు కెనడా వెళ్తున్నారు. అమెరికా వెళ్లి చదువు పూర్తి చేసిన విద్యార్థులు సైతం హెచ్1బీ వీసా దొరకకుంటే ప్రత్యామ్నాయ మార్గంగా ఆ దేశాన్ని ఎంచుకుంటున్నారు.
* అమెరికా నుంచి కెనడా వీసా పొందటం చాలా సులభం. యూఎస్‌లో ఉద్యోగం చేసిన అనుభవం తదితర కారణాల వల్ల పీఆర్ హోదా దక్కించుకోవడం భారతీయులకు నల్లేరు మీద నడకగా మారుతోంది.
* అభ్యర్థి చదువు, వయసు, ఉద్యోగ అనుభవం, ఆంగ్ల భాష తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని పాయింట్ల విధానంపై హోదా ఇస్తున్నారు. అది భారతీయ విద్యార్థులకు కలిసి వస్తోంది.
ద ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్- ఐఈఎల్‌టీఎస్‌లో కనీసం 6 పాయింట్లు పొందితే చాలు విద్యార్థి వీసా వస్తుందని గుంటూరుకు చెందిన వరల్డ్ వైడ్ ఎడ్యు కన్సల్టెంట్స్ ఎండీ ఉడుముల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. అమెరికాలో చదువుకొని హెచ్1బీ వీసా పొందలేకపోయిన విద్యార్థులు భారత్‌కు తిరిగి రాకుండా అమెరికాకు ఆనుకొని ఉన్న కెనడా వెళ్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఐఎంఎఫ్‌ఎస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ అజయ్‌కుమార్ మాట్లాడుతూ అమెరికా వెళ్లి ఇబ్బందులు పడటం కంటే కెనడా వెళ్తే మంచిది కదాని తల్లిదండ్రులూ ఆలోచిస్తున్నారని తెలిపారు. ‘ఈ ఒకటీ రెండు సంవత్సరాల్లో అమెరికా నుంచి కెనడా వచ్చిన ఎన్నో భారతీయ కుటుంబాల గురించి నాకు తెలుసు. ఏపీ నుంచి ఎంతో మంది కెనడా విద్య గురించి ఆరా తీస్తున్నారు’ అని టొరంటోలో ఓ ఐటీ కంపెనీలో ఆర్కిటెక్టుగా పనిచేస్తున్న హనుమంతురావు గనిపినేని చెప్పారు. పీఆర్ హోదా పొందిన అయిదు సంవత్సరాలకు సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.