Movies

కర్బందా సామాను గోవిందా

Kriti Karbandha Fires On Airlines For Missing Her Luggage

ఎన్నో టాలీవుడ్‌ చిత్రాల్లో నటించినప్పటికీ ‘తీన్‌మార్‌’ హీరోయిన్‌గా ప్రేక్షకులకు గుర్తుండిపోయే నటి కృతి కర్భందా. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా కృతికి చెందిన లగేజీ ఎయిరిండియా విమానంలో మిస్‌ అయ్యింది. దీంతో ఆమె ఎయిరిండియాపై ఆగ్రహంతో కొన్ని ట్వీట్లు పెట్టారు. ‘ప్రియమైన ఎయిరిండియా.. నా లగేజీని మరోసారి మిస్‌ చేసినందుకు ధన్యవాదాలు. ప్రయాణికులతో ఎలా ప్రవర్తించాలో మీ సిబ్బందికి కనీస మర్యాద నేర్పించండి.’ అని కృతి ట్వీట్‌ చేశారు. కృతి పెట్టిన ట్వీట్‌పై స్పందించిన ఎయిరిండియా సంస్థ.. ‘మా క్షమాపణలను అంగీకరించండి. సదరు బృందంతో చర్చిస్తాం. లగేజీ ట్యాగ్‌ నంబర్‌, మీ ప్లైయిట్‌ వివరాలు తెలియచేయగలరు.’ అని రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉండగా ఎయిరిండియా ఇచ్చిన రిప్లైపై కృతి తనదైన శైలిలో స్పందించారు. ‘మీ క్షమాపణలను అంగీకరించడం నాకు ఇష్టమే కానీ నా లగేజీకి సంబంధించి ఎలాంటి సమాచారం ఇంకా తెలియలేదు. ముంబయి లేదా గోవా ఎయిర్‌పోర్ట్‌లోని మీ బృందాలు ఇప్పటివరకూ అది ఎక్కడ ఉందో కనిపెట్టి చెప్పలేకపోయాయి’ అని కృతి ట్వీట్‌ చేశారు.