తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. నివేదిక వచ్చాక ఈ అంశంపై అవసరమైతే ఆగమపండితులతో చర్చిస్తామన్నారు. తిరుమలలో మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమలలో రోడ్డుపై వెళ్లే మోనో, ట్రామ్ రైల్ తరహా వాటిని మాత్రమే పరిశీలిస్తున్నామని.. తీగలపై నడిచే రైలు వంటివాటి జోలికి వెళ్లడం లేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు రైలు ప్రతిపాదన ఉపయోగపడుతుందని సుబ్చారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆస్ట్రియాలో ఎత్తయిన కొండపైకి మోనో రైలు వెళ్తోందని.. దాన్ని మోడల్‌గా తీసుకుని తిరుమలకు రైలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ పేరుతో ట్విటర్లో జరుగుతున్న ప్రచారాన్ని సుబ్బారెడ్డి ఖండించారు. తితిదేకు చెందిన రూ. 2,300 కోట్లను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేస్తున్నామంటూ అజిత్ డోభాల్ పేరుతో ప్రచారం జరుగుతోందని.. అది అజిత్ ఢోబాల్ ట్విటర్ ఖాతాయే కాదన్నారు. అది నకిలీ ఖాతాగా తితిదే అధికారులు పరిశీలనలో తేలిందని చెప్పారు. దుష్ప్రచారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. జాతీయ భద్రతా సలహాదారు పేరుతో చేసే దుష్ప్రచారాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని.. నకిలీ ఖాతాలతో ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని సుబ్బారెడ్డి హెచ్చరించారు. తిరుమలలో త్వరలోనే సైబర్ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
తిరుమలకు రైలు సౌకర్యం

Related tags :