‘పరమపద విళైయాట్టు’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో నటి త్రిష పాల్గొనకపోతే ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్‌లో కొంత భాగం నిర్మాతకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని నిర్మాత టి.శివ హెచ్చరించారు. 24 హౌస్ ప్రొడక్షన్స్ బ్యానరుపై తిరుజ్ఞానం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పరమపద విళైయాట్టు’. ఇందులో త్రిష ప్రధాన పాత్ర పోషించారు. ఆమెకు ఇది 60వ చిత్రం కావడం విశేషం. అమ్రీష్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం చెన్నైలోని సత్యం థియేటర్‌లో జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి నటి త్రిష హాజరు కాలేదు. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్వయాన ఆమే పాల్గొనకపోవడంతో చిత్ర బృందం ఆవేదనకు గురైంది. ఇదిలా ఉండగా కార్యక్రమంలో భాగంగా నటి సంగీత మాట్లాడుతూ ‘ఇందులో త్రిషకు స్నేహితురాలిగా నటించా. నేను బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమవుతున్న చిత్రమిది. చిత్రంలో తనకు మంచి పాత్రను ఇచ్చిన శివజ్ఞానానికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు అమ్రీష్ మాట్లాడుతూ ‘ఇది నాకు 8వ చిత్రం. త్రిషకు 60వ సినిమా కావడం విశేషం. ‘మొట్ట శివ కెట్ట శివ’ మాదిరిగానే ఇందులో పాట ఉండాలని దర్శకుడు కోరారు. ఈ చిత్రంలో ఒక్క పాటే ఉంది. అది ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని’ అన్నారు. నిర్మాత శివ మాట్లాడుడూ ‘ఈ సినిమాను నేను ఇంకా చూడలేదు. కానీ చిత్రాన్ని చూసిన నా మిత్రులు చాలా బాగుందని చెప్పారు. హీరో లేకుండా అద్భుతంగా రూపొందించారు. త్రిష స్టార్ హోదాతో సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా కార్యక్రమానికి ఆమె రాకపోవడం బాధాకరం. భవిష్యత్తులో ఆమె ఇలాంటి ప్రచార కార్యక్రమాలకు సహకరించకపోతే ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్‌లో కొంత భాగం నిర్మాతకు తిరిగి ఇచ్చేలా నిర్మాతల మండలి తరఫున కోరుతామని’ చెప్పారు.
త్రిష డబ్బులు లాక్కుంటానన్న నిర్మాత
Related tags :