DailyDose

భారత పర్యటనకు బయల్దేరిన డొనాల్డ్-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today - Trump Leaves For India

* రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు బయల్దేరారు. శ్వేతసౌధం నుంచి సతీమణి మెలానియాతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో బయల్దేరారు. ఈ విమానం జర్మనీ మీదుగా భారత్‌కు రానుంది. భారత్‌ పర్యటనకు ముందు మీడియాతో ట్రంప్‌ మాట్లాడుతూ తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నట్లు ప్రధాని మోదీని ఉద్దేశించి చెప్పారు.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత్‌ పర్యటనకు అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో గుజరాత్, యూపీ, దిల్లీ ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఫిబ్రవరి 24 (సోమవారం) ఉదయం ట్రంప్‌ భారత్‌ చేరుకోనున్నారు. ఆయన పర్యటన వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

* భారత ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్‌అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రిటైల్‌ వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 50 కంపెనీల జాబితాలో ‘రిలయన్స్‌ రిటైల్‌’ మొదటి స్థానంలో నిలిచింది. డెలాయిట్‌ సంస్థ నిర్వహించిన గ్లోబల్‌ పవర్స్‌ ఆఫ్‌ రిటైలింగ్‌ 2020 ఇండెక్స్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2013-2018 మధ్య అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న 50 కంపెనీల జాబితాలో రిలయన్స్‌ రిటైల్‌ తొలి స్థానం సాధించినట్లు నివేదికలో పేర్కొంది

* తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై ఇదే చివరి సమావేశమని జస్టిస్‌ ధర్మాధికారి స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజన సమస్యపై ఇరు రాష్ట్రాల అధికారులతో దిల్లీలో జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ ఇవాళ భేటీ అయింది. గతంలో కమిటీ సమర్పించిన నివేదికపై ఇరు రాష్ట్రాల అధికారుల అభ్యంతరాలను స్వీకరించినట్లు జస్టిస్‌ ధర్మాధికారి తెలిపారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వారం రోజుల్లో సప్లిమెంటరీ నివేదిక ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

* సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తొమ్మిది మాసాల పాలనలో కూల్చివేతలు, రద్దులే మిగిలాయని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఏపీలో వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని ఆయన ఆరోపించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అవంబిస్తోన్న విధానాల వల్ల రిలయన్స్‌, అదాని సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని.. రాష్ట్రానికి కొత్తగా ఎలాంటి పెట్టుబడులు రావడం లేదన్నారు.

* భారత విమానాశ్రయాల్లో మరో నాలుగు దేశాల ప్రయాణికులకూ కొవిడ్ పరీక్షలను విస్తరింపజేస్తూ డెరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌‌(డీజీసీఏ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. నేపాల్‌, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా దేశాల నుంచి వచ్చే వారికి సైతం విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆ సంస్థ విమానాశ్రయాలను ఆదేశించింది. ఈ మేరకు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు యావత్‌ భారతదేశం ఎదురుచూస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి రెండు రోజుల పర్యటనను పురస్కరించుకుని ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు. ట్రంప్‌కు ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ ట్వీట్‌ను జతచేశారు. గుజరాత్‌లో ప్రతి ఒక్కరూ #నమస్తే ట్రంప్‌ గురించే మాట్లాడుకుంటున్నారంటూ ఆయన చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు.

* ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం ఏది? ఆ స్టేడియం ఏ దేశంలో ఉంది? అనే ప్రశ్నలకు ఎంసీసీ, ఆస్ట్రేలియా అన్న జవాబుకు కాలం చెల్లింది. ఈ నెల 24 నుంచి ఆ ప్రశ్నలకు మొతెరా, భారత్‌ అని సమాధానాలు రాసుకోవాల్సి ఉంటుంది. అవును.. ఎంసీసీని తలదన్నే స్టేడియాన్ని భారత్‌ నిర్మించింది. అహ్మదాబాద్‌లోని పురాతన సర్దార్‌ పటేల్‌ స్టేడియాన్ని కూలగొట్టి నిర్మించిన అధునాతన, అద్భుత స్టేడియాన్ని ఈ నెల 24నే ఆవిష్కరించనున్నారు.

* ఈ వేసవిలో చల్లదనం కోసం ఏసీలు కొనాలనుకునేవారికి షాక్‌. ఈ సారి ఏసీల ధరలు పెరగనున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో విడి భాగాల దిగుమతి భారం కానుండడం.. బడ్జెట్‌లో వాటిపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచడం ఇందుక్కారణం. దీంతో దాదాపు 5 శాతం మేర ఏసీల ధరలు పెంచాలని ఆయా కంపెనీలు నిర్ణయించాయి.

* పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కారణంగా దేశరాజధాని దిల్లీలోని మౌజ్‌పూర్‌ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మౌజ్‌పూర్‌ ప్రాంతంలో కొందరు సీఏఏకు మద్దతుగా అనుకూల ర్యాలీ ప్రారంభించారు. ఇప్పటికే సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న జఫ్రాబాద్‌ ప్రాంతానికి మౌజ్‌పూర్‌ అతి సమీపంలో ఉంది. ఈ క్రమంలో సీఏఏ అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలు రెండు వర్గాల మధ్య ఘర్షణకు తావు తీశాయి. ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.