DailyDose

కోడి కోసం కొడుకుని చంపిన తండ్రి-నేరవార్తలు

Telugu Crime News Roundup Today-Father Kills Son For Chicken

* విజయనగరం జిల్లా బొద్దిడిలో దారుణం చోటుచేసుకుంది. కోడి కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడిలో అడ్డాకుల మద్దేశ్వరరావు (22) అనే వ్యక్తి తన పెరట్లో కోడిని పెంచుకుంటున్నాడు. అతడి తండ్రి కాంతారావు ఆ కోడిని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచడంతో అది చనిపోయింది. ఇంటికొచ్చిన కుమారుడు కోడి గురించి ఆరా తీయగా మృతిచెందినట్లు తండ్రి బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన తండ్రి.. కత్తితో కొడుకు ఛాతిపైన పొడిచాడు. దీంతో మద్దేశ్వరరావు అక్కడే కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు భద్రగిరిలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతిచెందాడు. అనంతరం తండ్రి కాంతారావు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

* ఓ మహిళపై నాటు తుపాకీతో, కాల్పులు జరిపి పరారైన ఆర్మీ మాజీ జవాన్‌ ఆత్మహత్య. చేసుకున్నాడు. నిందితుడు బాలాజీ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఆదివారం మృతుడు బాలాజీ తల్లిదండ్రులను ఘటనా స్థలానికి తీసుకు వెళ్లారు. మృతదేహం బాలాజీదేనని అతడి తల్లిదండ్రులు నిర్థారించారు. పోలీసుల కథనం మేరకు కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన యేమినేని బాలాజీ గతంలో ఆర్మీలో పనిచేసేవాడు. అతను మండలంలోని నడింపల్లి గ్రామానికి చెందిన రమాదేవి కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకుంటానని నమ్మబలికి ఆమెకు ద‌గ్గ‌ర‌య్యాడు. తీరా వివాహం చేసుకోమని యువతి ప్రశ్నించగా అదిగో ఇదిగో అంటూ కాలం గడిపి.. చివరకు తనకు సంబంధం లేదన్నాడు. దీంతో బాధిత యువతి తన తల్లితో కలిసి బాపట్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో 2019 డిసెంబర్‌ రెండో తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో బాలాజీ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వారిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం వేకువజామున తన స్నేహితుడి సాయంతో ఆటోలో నడింపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. తలుపులు కొట్టగా యువతి తల్లి రమాదేవి తలుపులు తీసింది. అంతలో బాలాజీ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో కాల్చాడు. అప్రమత్తమైన రమాదేవి పక్కకు తప్పుకోవటంతో ఆమె చెవికి తూటా తగిలింది. తుపాకీ శబ్దం, రమాదేవి కేకలు విని స్థానికులు బాలాజీని పట్టుకునే ప్రయత్నం చేశారు. తుపాకీతో స్థానికులను బెదిరించి తనతోపాటు వచ్చిన ఆటో డ్రైవర్‌తో కలిసి పరారయ్యాడు. గాయపడ్డ రమాదేవిని స్థానికులు దగ్గరలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా∙స్థలానికి చేరుకుని సమీపంలో పడిఉన్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని,  కేసు దర్యాప్తు చేపట్టారు.

* ఉరేసుకుని టెంట్‌హౌస్‌ నిర్వాహకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుల్తాన్‌బజార్‌ పోలీసుల వివరాల ప్రకారం.. కాచిగూడ లింగంపల్లికి చెందిన సావెల గణేష్‌కుమార్‌(55) టెంట్‌హౌస్‌ నిర్వహిస్తున్నారు. రాజ్‌మోహల్లాలో గోదాం ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. టెంట్‌హౌస్‌ను ఖాళీ చేయాలంటూ యాజమాన్యం ఒత్తిడితో మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 21న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం పెద్ద కుమారుడు గోదాంకు వెళ్లగా తండ్రి ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు గమనించాడు. గణేష్‌ ప్యాంటు జేబులో సూసైడ్‌ నోట్‌ లభించింది.  నిరంజన్‌రావు, జయపాల్‌రావు, కృష్ణమూర్తి కులం పేరుతో దూషించి అవమానించడంతో ఆత్మహత్య చేసుకుంటున్న‌ట్లు రాసి ఉంది. కేసు నమోదు చేశారు.

* నగరంలోని కర్మన్‌ఘాట్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా చెట్టును ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. మృతి చెందిన వ్యక్తులు ప్రభు, సాయినాథ్, వినాయక్ శ్రీగా గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

* సత్యవేడులో నిర్వహించిన పోలీసుల దాడుల్లో రూ. 20 లక్షల విలువైన గుట్కాను వాహనంతో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి రోడ్డులో సీఐ బీవీ శ్రీనివాసులు ఆధ్వ‌ర్యంలో నాలుగు మండలాల పోలీస్ అధికారులు టీమ్ గా మూకుమ్మడి తనిఖీలు నిర్వహిస్తుండగా ఆదివారం వేకువ జామున  అక్రమంగా గుట్కాలను స్థానిక గోడౌన్ కు తరలిస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా ఈ ఉదంతం వెలుగు చూసింది. కర్ణాటక నుంచి అక్రమంగా సత్యవేడులో గల ముత్తుశెట్టి గోడౌన్ లో నిల్వ చేసేందుకు తరలిస్తుండగా పోలీసులు పక్కా వ్యూహంతో నిఘా వేసి గుట్కాతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

* కామవరపుకోట మండలం గొల్లగూడెం వద్ద ఆదివారం తెల్ల‌వారుజామున‌ అదుపు తప్పిన వ్యాన్‌ చెట్టును ఢీకొని బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో ప్ర‌వీణ్ (20) అనే వ్య‌క్తి మృతి చెంద‌గా.. మ‌రో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కృష్ణా జిల్లా పెడన నుండి  గుబ్బల మంగమ్మ గుడికి వ్యాన్‌లో 11 మంది భక్తులు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. డ్రైవర్ పరారీ. తడికలపూడి పోలీసులు జ‌రిగిన ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

* నగరలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ 3లో శ‌నివారం రాత్రి కారు బీభ‌త్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు టిఫిన్‌ సెంటర్‌ ముందు గోడను ఢీకొట్టి ఆగిపోయింది. కారులో ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోవడంతో ప్రయాణిస్తున్న వారికి ప్రాణపాయం తప్పింది. యువకులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. సమాచారం అందుకున్నపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు..

* సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో, ప్రమాదం చోటు చేసుకుంది. నూతన బాయిలర్‌ నిర్మాణ కోసం పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో, మట్టి పెళ్లలు కుప్పకులాయి. ఒక్కసారిగా మట్టిపెళ్లలు పడటంతో, కూలీలు ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా. గాయపడ్డ నలుగురు కూలీలను చికిత్స కోసం మంచిర్యాల, కరీంనగర్‌ ఆస్పత్రులకు తరలించారు.

* గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం. ట్రక్కు, టెంపో ఢీకొని 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వడోదర జిల్లాలోని పాద్రా తాలూక పరిధిలో, శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. తమ బంధువుల వివాహ ముందుస్తు వేడుకలకు పలువురు హాజరై తిరిగి తమ ఇళ్లకు టెంపోవాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో, తాము ప్రయాణిస్తున్న వాహనం, ట్రక్కు ఎదురెదురుగా ఒక దాని కొకటి ఢీకొన్నాయి. దీంతో ఘటన స్థలంలోనే తీవ్రగాయాలతో ఏడుగురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు.

* అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద ఉదయం ఆరు గంటల ప్రాంతంలో, బూడిద కోసం వెళుతున్న లారీ మూల మలుపు వద్ద చెట్టును ఢీకొట్టి బోల్తా పడ్డది. ఈ ప్రమాదంలో గోదావరిఖనికి చెందిన డ్రైవర్ పిల్లి శ్రీనివాస్ (30). విటల్ నగర్, క్లీనర్ మహమ్మద్ అబ్దుల్ గఫూర్ (20). విటల్ నగర్ కు చెందిన ఇద్దరు మృతి. విషయం తెలుసుకున్న అంతర్గాం ఎస్ఐ రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకొని. కేసు నమోదు చేసుకుని, పూర్తి వివరాలు సేకరించి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

* పోలీస్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. సైదాబాద్‌ టి జంక్షన్‌ వద్ద పోలీసులు రహదారికి అడ్డంగా వాహనం నిలిపారంటూ కమిషనర్‌కు ఓ పౌరుడు ట్వీట్‌ చేశాడు. పౌరుడి ఫిర్యాదును నగర పోలీస్‌ కమిషనర్‌ ట్విటర్‌లో ట్రాఫిక్‌ విభాగానికి పంపారు. దీంతో పోలీస్‌ వాహనానికి మీర్‌ చౌక్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. రహదారికి అడ్డంగా పార్క్‌ చేసి నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఆ వాహనానికి రూ.135లు విధించారు.

* భువనగిరి ఖిల్లాపై ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు బాధితులను భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

* అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించనున్న మొతేరా స్టేడియం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం ఒకటి ఆదివారంనాడు కుప్పకూలింది. ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ కోసం తుది సన్నాహకాలు జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు స్వాగత ద్వారం కూలిపోయినప్పుడు ఎవరూ గాయపడలేదు. ఇలాంటి స్వాగతద్వారాలు స్టేడియం వద్ద నిర్వాహకులు చాలానే ఏర్పాటు చేశారు. 49,000 మందిని ఆపగలిగే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నరేంద్ర మోడీ సోమవారంనాడు సంయుక్తంగా ప్రసంగించనున్నారు.

* ఒడిషాలో ఏనుగుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. పూరీ జిల్లాలోని గోపీనాథ్‌పూర్‌లో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. గ్రామంలోకి వచ్చి ప్రజలపై దాడి చేసాయి. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఏనుగులను దారి మళ్లించారు.

* చైనాలో కోవిడ్‌-19 వైరస్‌ కారణంగా తాజాగా 98 మరణించడంతో మరణించిన వారి సంఖ్య 2442కు పెరిగింది. చైనాలో మొత్తం 76,936 మందికి కోవిడ్‌ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా 1836 మందికి వైరస్‌ సోకగా, దీనివల్ల 20 మంది మృతి చెందారు. వివరాలు ఈ కిందివిధంగా ఉన్నాయి. డైమండ్‌ ప్రిన్సెస్‌2, జపాన్‌ 1, సౌత్‌ కొరియా 4, హాంగ్‌కాంగ్‌ 2, ఇటలీ 2, ఫ్రాన్స్‌ 1, ఇరాన్‌ 5, థైవాన్‌ 1, ఫిలిప్పీన్స్‌ 1, సింగపూర్‌ 1. భారతదేశంలోని మహారాష్ట్రలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచిన 77 మందికి కోవిడ్‌ పరీక్ష నెగటివ్‌గా వచ్చింది. కేంద్రమంత్రి డాక్టర్‌ హర్షవర్దన్ కోవిడ్‌ తీవ్రత, ఇప్పటి వరకూ చేపట్టిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.