‘నా నిష్క్రమణకు వేళైంది. ఇందుకు బెర్క్‌షైర్ హాథవే 100 శాతం సిద్ధంగా ఉన్నది’ అని ఆ సంస్థ అధినేత, బిలియనీర్, పెట్టుబడుల రారాజు వారెన్ బఫెట్ శనివారం అన్నారు. వ్యాపార వారసుడు ఎవరో స్పష్టంగా చెప్పకుండానే తన వీడ్కోలు సంకేతాలనిచ్చిన 89 ఏండ్ల బఫెట్.. తన సుదీర్ఘ భాగస్వామి, 96 ఏండ్ల చార్లీ ముంగర్ సైతం ఇక సెలవు తీసుకుంటున్నారని వాటాదారులనుద్దేశించి విడుదల చేసిన వార్షిక లేఖలో ప్రకటించారు. కాగా, నిరుడు మేలో జరిగిన వార్షిక వాటాదారుల సమావేశంలో గ్రేగరీ ఏబుల్ (57), అజిత్ జైన్ (67)లకు వారసత్వ అవకాశాలున్నట్లు బఫెట్ సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. గతేడాది ఈ ఇరువురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఎన్నికైయ్యారు కూడా. ఈ క్రమంలో బఫెట్ నిష్క్రమణ తర్వాత ఈ ఇద్దరిలో ఒకరు బెర్క్‌షైర్ హాథవే పగ్గాలను చేపట్టవచ్చన్న అంచనాలున్నాయి. తన నిష్క్రమణ సంకేతాలిచ్చిన బఫెట్.. బెర్క్‌షైర్ వాటాదారులు ఆందోళన చెందనక్కర్లేదని ఒకింత ధైర్యమిచ్చే ప్రయత్నం చేశారు. తదుపరి వాటాదారుల సమావేశం ఈ ఏడాది మే 2న ఉండగా, దాదాపు 88 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల్లో బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు.
నా రిటైర్మెంట్ సమయం ఆసన్నమైంది

Related tags :