Business

చైనాపై భారత్ ఆంక్షలు

Coronavirus affect hits indo-chinese business relations

చైనాకు వైద్య పరికరాల ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. దేశంలో వాటి సరఫరా డిమాండ్‌కు తగినట్లుగా లేనందున ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. అంతే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల మేరకు కరోనా (కొవిడ్‌ -19) వైరస్‌పై అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని రకాల వైద్య పరికరాల ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించడంపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత్ స్పందించింది. ‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న అత్యవసర పరిస్థుతల దృష్ట్యా భారత్ చైనాకు అవసరమైన వైద్య పరికరాలను అందిస్తుందని ఆశిస్తున్నాం. త్వరలోనే ఇరుదేశాల మధ్య దీనికి సంబంధించి సహకార వాణిజ్యం ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం’’ అని చైనా రాయబార కార్యలయ ప్రతినిధి జీ రాంగ్ అన్నారు. కొవిడ్ కారణంగా చైనాపై ప్రయాణ, వ్యాపార పరమైన ఆంక్షలను డబ్ల్యూహెచ్‌వో తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని జీ రాంగ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాజాగా దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్ స్పందించారు. ‘‘భారత్‌లో పలు రకాల వైద్య పరికరాల సరఫరా తక్కువగా ఉన్నందున చైనాకు వాటి ఎగుమతులపై ఆంక్షలు విధించాం. భారత్‌లో జనాభా అధికం. బాధ్యత గల దేశంగా కొవిడ్ వ్యాపించకుండా నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలా కాకుంటే ఈ వైరస్‌ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అయితే చైనా అవసరాల దృష్ట్యా కొన్ని రకాల పరికరాల ఎగుమతులకు అనుమతించాం’’ అని తెలిపారు. ఈ నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధ్యక్ష్యుడు షీ జిన్‌ పింగ్‌కు లేఖ రాశారు. ఈ మేరకు వైద్య సామగ్రితో ఉన్న ఓ సహాయక విమానాన్ని వుహాన్‌ నగరానికి పంపుతామని భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. అదే విమానంలో చైనాలో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని యోచించింది. అయితే ఇందుకు చైనా ఇంకా అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. కొవిడ్ ప్రభావం కారణంగా భారత్ చైనాకు విమాన సర్వీసులను నిలిపివేసింది. కొద్ది రోజుల క్రితం వుహాన్‌కు ప్రత్యేక విమానాన్ని పంపి 640 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. తాజాగా వుహాన్‌లో చిక్కుకున్న మరికొంత మంది భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.