* డాలరుతో రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయంగా ధరలు పెరుగుదలతో బంగారం ధర భారీగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్స్) బంగారం ధర ఒక్కరోజే రూ.953 పెరిగి రూ.44,472కి చేరింది. గత ట్రేడింగ్ సెషన్‌లో దీని ధర రూ.43,519గా ఉంది. వెండి ధర సైతం భారీగా పెరిగింది. గత ట్రేడింగ్‌లో రూ.49,404గా ఉన్న ధర రూ.586 పెరిగి రూ.49,990కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు బంగారం ధర గరిష్ఠంగా 1682 డాలర్లకు చేరింది. అదే సమయంలో వెండి ఔన్సు ధర కూడా 18.80 డాలర్లకు పెరిగింది. దీనికి తోడు డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణించడం బంగారం ధరలు పెరుగుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ పేర్కొన్నారు. ఒక్క సోమవారం రోజే రూపాయి మారకం విలువ 22 పైసలు మేర క్షీణించింది. దీనికి తోడు కరోనా వైరస్ ప్రభావం చైనా వెలుపలి దేశాలైన దక్షిణ కొరియా, మధ్య ఆసియా, ఇటలీ దేశాల్లో కనిపించడం, అక్కడ మరణాలు సంభవిస్తుండడంతో బంగారం ధరల పెరుగుదలకు మరో కారణమని పటేల్ తెలిపారు.
* భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే దశలో ఉందని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ముంబయిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో నిర్వహించిన ఫ్యూచర్ డీకోడ్ సీఈవో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభావం మొబైల్ నెట్ వర్క్ విపరీతంగా పెరగడంతో పాటు గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా విస్తరించడం వల్లేనన్నారు. ఇదంతా 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా వల్లేనని చెప్పారు. 380 మిలియన్ల మంది ప్రజలు జియో 4జీ టెక్నాలజీ వైపు మళ్లారన్నారు. ప్రీ జియో డేటా స్పీడ్ 256 కేబీపీఎస్ కాగా.. పోస్ట్ జియో వేగం 21ఎంబీపీఎస్‌తో ఉందని వివరించారు.
* చైనాకు వైద్య పరికరాల ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. దేశంలో వాటి సరఫరా డిమాండ్‌కు తగినట్లుగా లేనందున ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. అంతే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల మేరకు కరోనా (కొవిడ్ -19) వైరస్‌పై అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని రకాల వైద్య పరికరాల ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించడంపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత్ స్పందించింది. ‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న అత్యవసర పరిస్థుతల దృష్ట్యా భారత్ చైనాకు అవసరమైన వైద్య పరికరాలను అందిస్తుందని ఆశిస్తున్నాం. త్వరలోనే ఇరుదేశాల మధ్య దీనికి సంబంధించి సహకార వాణిజ్యం ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం’’ అని చైనా రాయబార కార్యలయ ప్రతినిధి జీ రాంగ్ అన్నారు. కొవిడ్ కారణంగా చైనాపై ప్రయాణ, వ్యాపార పరమైన ఆంక్షలను డబ్ల్యూహెచ్‌వో తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని జీ రాంగ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
* కరోనా వైరస్ (కొవిడ్ 19) వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం ప్రమాదంలో పడిందంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ క్రిస్టలీనా ఆదివారం చేసిన వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయి. ఈ వారం సూచీలు ఒడుదొడుకుల్లో చలించొచ్చని, విదేశీ సంస్థాగత మదుపుదార్ల నుంచి విక్రయాల ఒత్తిడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఫిబ్రవరి ఫ్యూచర్స్- ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనున్నందున, మదుపర్లు భారీ పొజిషన్లకు దూరంగా ఉండొచ్చని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన, ఆయన వ్యాఖ్యలనూ సునిశితంగా పరిశీలించొచ్చని చెబుతున్నారు. శుక్రవారం వెలువడనున్న జీడీపీ అంచనాలు, కీలక మౌలిక రంగ గణాంకాలు ప్రభావం చూపుతాయి. చైనాలో వినియోగ మార్కెట్ మార్చిలో స్థిరీకరణకు గురై ఏప్రిల్-జూన్‌లో పుంజుకోగలదని అక్కడి వాణిజ్య మంత్రి చెబుతున్నారు. నిఫ్టీ ఈ వారం 12050-12300 శ్రేణిలో కదలాడవచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కొంత మంది మాత్రం నిఫ్టీ 12,500 పాయింట్లకు చేరొచ్చని భావిస్తుండడం గమనార్హం.