శ్రీవారి దర్శన టోకెన్లు గల భక్తులకు మరింత సౌకర్యవంతంగా ప్రవేశమార్గాలు: టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల శ్రీవారి దర్శనార్థం దివ్యదర్శనం(నడకదారి), టైంస్లాట్ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు పొందిన భక్తులు కంపార్ట్‌మెంట్లలోకి వెళ్లేందుకు ప్రవేశమార్గాలు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. నిర్మాణంలో ఉన్న బూందీ కాంప్లెక్స్ పనులను ఏప్రిల్ లోపు పూర్తి చేయాలని, దాతల సహకారంతో చేపడుతున్నమ్యూజియం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో నిర్మించ తలపెట్టిన సప్తద్వారాల పనులపై సమీక్షించారు. తిరుమలో మరింత ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా ఉద్యానవనాల అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. కాలినడక మార్గంలో పైకప్పు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ పనులు చేపట్టాలని ఆదేశించారు. కన్యాకుమారి, వైజాగ్, భువనేశ్వర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులను వేగవంతం చేయాలని ఈవో కోరారు. స్థానికాలయాలు, విశ్రాంతి గృహాలు, విద్యాసంస్థల వద్ద సెక్యూరిటీ గార్డుల ఏర్పాటు, ఆలయాల్లో హెడ్ కౌంట్ యంత్రాల ఏర్పాటుకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో భక్తుల అభిరుచికి తగ్గట్టు పుస్తకాలను పునర్ముద్రించాలని సూచించారు. నూతనంగా ఆడిట్ సాఫ్ట్‌వేర్‌ను, టిటిడి కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ అడ్మిషన్ అప్లికేషన్‌ను సిద్ధం చేసుకోవాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్, ఇతర ప్రాజెక్టులు కలిపి కార్యక్రమాల వార్షిక క్యాలెండర్ రూపొందించాలని, తద్వారా ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చని అన్నారు. ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈఓ శ్రీ పి.బసంత్‌కుమార్, ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్ఇలు శ్రీ నాగేశ్వరరావు, శ్రీ వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.