Politics

ఏపీ ప్రజలకు నా వరం…విద్య!

YS Jagan Calls His Only Gift To People Is Education

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ప్రజల పరిస్థితి మారలేదని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యత ఉందని చెప్పారు. ప్రతి పేదవాని ఇంటి నుంచి పెద్ద చదువులు చదివి ఉన్నత స్థితికి చేరినపుడే ఆ పరిస్థితి మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇంటర్ తరువాత విద్య చూస్తే బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో 50 శాతం ఉంటే మన దేశంలో 25 శాతం మాత్రమే ఉందని.. ఈ పరిస్థితి నుంచి దేశం బయటపడాలన్నారు. మన రాష్ట్రం నుంచే మార్పు రావాలని.. అందుకే విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టామని సీఎం చెప్పారు. వసతి దీవెన కార్యక్రమం ద్వారా ఉన్నత చదువులు సజావుగా సాగాలన్నారు. డిగ్రీ, సాంకేతిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల వసతికి ఈ పథకం ఆసరాగా ఉంటుందన్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామని జగన్‌ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునేందుకు సంతోషంగా పంపాలనే ఈ చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలోకి నేరుగా నగదు చేరుతుందని సీఎం చెప్పారు. వచ్చే మూడేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. ఖర్చు ఎంతైనా ఫర్వాలేదని.. ఈ రాష్ట్రంలో నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమేనని జగన్‌ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులను సమర్థంగా తీర్చిదిద్దుతామన్నారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తున్నామని జగన్‌ వివరించారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నా కొంతమంది తమపై విమర్శలు చేస్తున్నారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ప్రజా బలం, దేవుని ఆశీస్సులతో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటానని జగన్‌ స్పష్టం చేశారు. తాను రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని.. మీ ఆశీర్వాదాలు కావాలంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు.