* కరోనా వైరస్ దెబ్బకు చైనాలో రసాయన కర్మాగారాలు మూతపడటంతో ఆ మేరకు ఆర్డర్లు భారత్‌కు మళ్లుతున్నాయి. ఒళ్లునొప్పులకు ఉపయోగించే ఐబుప్రొఫెన్ అతిపెద్ద ఉత్పత్తిదారైన ఐవోఎల్ కెమికల్స్ విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. గత రెండున్నరేళ్లలో ఎన్నడూ లేనంత డిమాండ్ వచ్చింది. చైనాలో హుబె ప్రావిన్స్‌లో కూడా దీనిని ఉత్పత్తి చేస్తారు. కానీ, ఆ ప్రాంతంలో కరోనా ప్రభావం కారణంగా చాలా రోజులుగా దీని తయారీ ప్లాంట్లు మూతపడ్డాయి. లూథియానాకు చెందిన ఐవోఎల్ ప్రపంచంలో మూడోవంతు ఐబుప్రొఫెన్‌ను సరఫరా చేస్తోంది. మరో 10శాతం చైనాలోని హుబె నుంచి సరఫరా అవుతుంది. తాజా పరిస్థితులతో ఈ ఔషధం ధర కిలోకు 3డాలర్లు పెరిగింది. దీంతో ధర 18 డాలర్ల నుంచి 20 డాలర్లకు పైగా చేరింది. ‘మరికొన్ని రోజులు హుబెలో పరిశ్రమలు మూతపడే అవకాశం ఉండటంతో సరఫరాలో ఉన్న లోటునుంచి మేము లబ్ధిపొందుతాము’అని ఐవోఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ గార్గ్ తెలిపారు.
* భారతీయరైల్వేకు టికెట్ల రద్దుతో ఆదాయం ఎంతో తెలుసా..అక్షరాల 9వేల కోట్లు. అవును, గత మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా వెయిటింగ్ లిస్టులో ఉండి రద్దు కాని టికెట్ల ద్వారా రూ.9వేల కోట్ల ఆదాయం సమకూరిందని రైల్వే సమాచార సంస్థ కేంద్రం(సీఆర్‌ఐఎస్)వెల్లడించింది. రాజస్థాన్ కోటాకు చెందిన సామాజిక కార్యకర్త సుజిత్ స్వామి సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారానికి సీఆర్‌ఐఎస్ ఈ సమాధానమిచ్చింది. జనవరి1, 2017 నుంచి జనవరి 31, 2020మధ్య దాదాపు తొమ్మిదిన్నర కోట్లమంది వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు వారి టికెట్ రద్దు చేసుకోకపోవడంతో రూ.4335కోట్లు భారతీయ రైల్వేకు ఆదాయంగా వచ్చింది. ఈ మధ్య కాలంలోనే ధృవీకరణ అయిన టికెట్లు రద్దు చేసుకోవడంతో దానికి చెల్లించే రుసుముతో మరో రూ.4684కోట్లు సమకూరిందని తెలిపింది. ఇలా ఈ మూడు సంవత్సరాల కాలంలో తొమ్మిదివేల కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. అయితే వీటిలో స్లీపర్‌క్లాస్ టికెట్ల నుంచే ఎక్కువ ఆదాయం రాగా..తరువాతి స్థానంలో థర్డ్‌ఏసీ టికెట్లనుంచి వచ్చినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ మూడు సంవత్సరాల కాలంలో ఇంటర్నెట్ సేవల ద్వారా 145కోట్ల ప్రయాణికులు టికెట్లు తీసుకోగా కేవలం 74కోట్ల మంది మాత్రమే రిజర్వేషన్ కేంద్రాలనుంచి తీసుకున్నారని తెలిపింది. ఆన్‌లైన్‌లో, రిజర్వేషన్ కేంద్రాలనుంచి టికెట్ తీసుకుంటున్నవారికి వేరు వేరు విధానాల వలన ప్రయాణికులపై భారం పడుతోందని, రైల్వేశాఖ ప్రయాణికుల నుంచి ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తోందని సుజిత్ స్వామి రాజస్థాన్ హైకోర్టును కూడా ఆశ్రయించాడు.
* భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చర్చలు పురోగతిలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఆదిత్య బిర్లాగ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా సహా పలువురు పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
* ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో నిబంధనలు ఉల్లంఘించినట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గుర్తించింది. ముఖ్యంగా ఇవి నిర్వహణలో, కంపెనీ లిస్టింగ్ నిబంధనలకు సంబంధించినవిగా సమాచారం. కంపెనీ సహ ప్రమోటర్ రాకేష్ గాంగ్వాల్ ఫిర్యాదు మేరకు నిర్వహించిన దర్యాప్తులో ఈ అంశాలు తేలాయి.