Politics

ఖమ్మంలో పొలిటికల్ టెన్షన్

Khammam DCCB Elections 2020 - Telugu Political Roundup

*** ‘కేంద్ర సహకార’ పదవులపై ఉత్కంఠ
*** డీసీసీబీ పీఠం ఓసీ కా.. బీసీ కా?..
*** డీసీఎంఎస్‌ చైర్మన్‌పైనా సర్వత్రా ఇదే చర్చ
*** ఎవరి ఊహాగానాల్లో వారు..
*** గోప్యంగా డైరెక్టర్ల జాబితా
*** ఖమ్మం చేరుకున్న ఇరుజిల్లాల్లోని సొసైటీల అధ్యక్షులు

డీసీసీబీ, డీసీఎంఎస్‌ నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ఉండటంతో ఉమ్మడి జిల్లాలోని అధికార టీఆర్‌ఎస్‌ నేతలంతా ఖమ్మంలో మకాం వేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఈ ఎన్నికలపై దృష్టిపెట్టారు. డైరెక్టర్ల అభ్యర్థుల జాబితా సోమవారం రాత్రి వరకు గోప్యంగా ఉంచగా.. ఎమ్మెల్యేల సిఫారసులను దృష్టిలో పెట్టుకుని ఆయా నియెజకవర్గాల్లో పేర్లను ఖరారు చేయనున్నారు. అయితే ఈసారి డీసీసీబీ చైర్మన్‌ పదవి విషయంలో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్‌ పదవి బీసీ సామాజిక వర్గ నాయకుడికి ఇస్తారా? లేదేంటే మరోసారి ఓసీ వ్యక్తికి కేటాయిస్తారా? అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

*** ‘భవిష్యత్‌’ను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం
త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు ఉన్నందున.. భవిష్యత్‌ రాజకీయ పరిణామాలు, సమీకరణలు, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకునే ఖమ్మం డీసీసీబీ ఎన్నిక వ్యవహారంపై నిర్ణయం ఉంటుందని టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం డీసీసీబీ పదవి బీసీకి కేటాయిస్తే.. స్థానిక స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఖమ్మం మేయర్‌ పదవి జనరల్‌కు దక్కే అవకాశం లేకపోలేదు. ఒక వేళ డీసీసీబీ చైర్మన్‌ పదవి ఓసీకి దక్కితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఖమ్మం మేయర్‌ పదవులు అప్పటి పరిస్థితిని బట్టి ఇతర వర్గాలకు కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సొసైటీ అధ్యక్షుల్లో అత్యధిక శాతం ఓసీలు ఉన్నందున తమకు కేటాయించాలని కొందరు తమ పార్టీ నేతలను కోరుతున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ నాయకత్వం మాత్రం డైరెక్టర్ల విషయంలో, చైర్మన్‌ వైస్‌ చైర్మన్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ.. ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు.

*** ఎవరి ఊహల్లో వారు
డీసీసీబీ చైర్మన్‌ బీసీకి కేటాయించారని, డీసీఎంఎస్‌ పీఠాన్ని ఓసీకి కేటాయించారని, అలాగే డీసీసీబీ ఎప్పటిలాగే ఓసీకి ఉంటుందని, డీసీఎంఎస్‌ బీసీకి ఇస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి వారు పదవులు పొందేందుకు పార్టీ అదిష్ఠానంపై ఒత్తిళ్లు పెంచుతున్నారు. దీనికితోడు టీఆర్‌ఎస్‌ జిల్లా నేతల్లో ఉన్న అంతర్గత పోరు ప్రభావం ప్రస్తుత డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలపై కనిపిస్తోంది. ఈ రెండు పదవులు తమ వర్గం వారికే తెచ్చుకోవాలని ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలకనిర్ణయం మాత్రం మంత్రి, పార్టీ ఎమ్మెల్యేలదే ఉండబోతోంది. ఏదేమైనా డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల ఎంపిక విషయం ఈసారి అధికార టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ రేపుతోంది. సామాజిక సమీకరణలు, భవిష్యత్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నిక జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

*** నగరానికి చేరుకున్న సొసైటీల అధ్యక్షులు
ఆదివారం వరకు మూడు క్యాంపులుగా ఉన్న రాజకీయం ఒకటిగా మారింది. సత్తుపల్లి, అశ్వారావుపేట క్యాంపుల్లో ఉన్న సొసైటీ అధ్యక్షులను కూడా ఖమ్మంలోని ఓ హోటల్‌కు తీసుకురావడంతో.. ఉమ్మడి జిల్లాలోని సొసైటీ అధ్యక్షులంతా ఒక చోటకు చేరారు. అయితే పాలేరు నియోజకవర్గ సొసైటీ అధ్యక్షులు మాత్రం హైదరాబాద్‌ నుంచి ఖమ్మం క్యాంప్‌కు మంగళవారం ఉదయంలోగా రానుండగా.. వారంతా డైరెక్టర్ల నామినేషన్లలో పాల్గొనబోతున్నారు.