Business

అసలు ఆ బంగారం ధర ఎందుకలా పెరుగుతోంది?

Telugu Business News-Why Is Gold Price Rising So High?

బంగారం ధర ఏడేళ్ళలో ఎన్నడూ లేనంత పెరిగింది… ఎందుకిలా?

అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం, డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది.
సోమవారం దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 953 రూపాయలు పెరిగి, 44,472 రూపాయలకు చేరిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ను ఉటంకిస్తూ వార్తాసంస్థ పీటీఐ తెలిపింది. గత ట్రేడింగ్ సెషన్లో ధర 43,519 రూపాయల వద్ద ఉంది.

కరోనావైరస్ చైనా వెలుపల కూడా వ్యాపిస్తుండటం, దక్షిణ కొరియా, మధ్య ప్రాచ్య దేశాలు, ఇటలీలో కోవిడ్-19 కేసులు, మరణాలు పెరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్(కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పారని పీటీఐ తెలిపింది.

బంగారం డిమాండ్ అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి.

కరోనావైరస్ వ్యాప్తి ప్రభావంతోనే…

అంతర్జాతీయంగా బంగారం ధర ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలపై కరోనావైరస్ వ్యాప్తి ప్రభావంపై ఆందోళనల నేపథ్యంలో, పెట్టుబడికి బంగారమే సురక్షితమైనదని మదుపర్లు భావించడమే దీనికి ప్రధాన కారణం.
పసిడి ధరలు సోమవారం రెండు శాతానికి పైగా ఎగబాకాయి. 2013 ఫిబ్రవరి తర్వాత ఎప్పుడూ చేరని స్థాయికి చేరాయి. తక్షణం పంపిణీ చేసే బంగారం ఔన్సు ధర సోమవారం 1,680 డాలర్లు దాటింది.

పసిడి ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు పది శాతానికి పైగా పెరిగింది.
త్వరలోనే 1,700 డాలర్లను దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిడి ధరల పెరుగుదల ఊపందుకొందని ఆన్‌లైన్ ట్రేడింగ్ వేదిక ఒయాండాలో సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జెఫ్రీ హాలే వ్యాఖ్యానించారు.
మరోవైపు చమురు ధరలు సోమవారం దాదాపు నాలుగు శాతం పడిపోయాయి. కరోనావైరస్ కారణంగా కర్మాగారాల తాత్కాలిక మూసివేత వల్ల డిమాండ్‌లో పతనం గురించి మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు రెండు డాలర్లకు పైగా తగ్గి 56.18 డాలర్లకు చేరింది.