ఆఫీస్, బజారు లేదా సినిమా… ఎక్కడికెళ్లినా మహిళలకు హ్యాండ్‌బ్యాగు తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడు మనకు కావాల్సినవన్నీ అందులో వేసుకుంటాం. అలాగని తోచినవన్నీ బ్యాగులో పడేయకూడదు. అందం, ఆరోగ్యం, అవసరానికి కావాల్సినవాటితోపాటు స్వీయరక్షణకు సంబంధించిన వస్తువులు ఉండేలా చూసుకోవాలి. ఓసారి మీ బ్యాగులో కింద చెప్పినవి ఉన్నాయో లేదో చూసుకోండి మరి!
*** పెప్పర్ స్ప్రే
అనుకోని కారణాలతో ఆఫీస్‌లో ఆలస్యం కావొచ్ఛు ఆ సందర్భాలు ముందుగా ఊహించి రావుకదా.. అందుకని మనమెప్పుడూ స్వీయరక్షణకు సిద్ధంగా ఉండాలి. అందుకే మన బ్యాగులో ఉండాల్సిన వస్తువుల్లో పెప్పర్ స్ప్రే వంటి ఆత్మరక్షణ ఆయుధం ఉండటం చాలా ముఖ్యం. ఇది మన దగ్గర ఉంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ●
*** తాళాల కోసం
బండి తాళాలు, ఇంటి తాళాలు… వీటికోసం బ్యాగంతా గాలిస్తాం. ఒక్కోసారి బ్యాగులో ఉన్నా దొరకవు. ఆ పరిస్థితి రాకుండా.. తాళాల వాలెట్ ఒకటి మన బ్యాగులో ఉండాలి. అందులో ఇంటి, వాహన తాళాలను భద్రపరుచుకుంటే, అవసరమైనప్పుడు ఎక్కువసేపు వెతకాల్సిన అవసరం ఉండదు. ●
*** చిరుతిళ్లు తప్పనిసరి
ఇంటి నుంచి తినోతినకో బయలుదేరుతాం. మరి బయట ఎక్కడా తినే అవకాశం లేకపోతే..? రోజంతా ఆకలితో నీరసించి ఉండిపోవాల్సిందేనా? ఎంత హడావుడిలో ఉన్నా సరే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బ్యాగులో కొన్ని రకాల చిరుతిళ్లు, డ్రైఫ్రూట్స్, నీళ్లసీసా వంటివి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆరోగ్యం మాటెలా ఉన్నా… సమయానికి మీకు శక్తినిస్తాయి. ఏ రోడ్డుమీదో కళ్లు తిరిగి పడకుండా అడ్డుకుంటాయి. అన్నట్టు వీటితోపాటు మౌత్‌ఫ్రెషనర్స్‌ను పెట్టుకోవడం మర్చిపోకండే! ●
*** ఇవీ ఉండాల్సిందే…
* శానిటైజర్‌తోపాటు బ్యాగులో కొన్ని ఫేస్‌వైప్స్ కూడా ఉంటే.. బయటకు వెళ్లినప్పుడు ముఖాన్ని శుభ్రపరుచుకోవడం తేలిక అవుతుంది.
* అదనంగా ఒక జత చెవి దిద్దులు, బొట్టుబిళ్లలు, ఓ శానిటరీ నాప్కిన్.. వంటివి ఉంచుకుంటే మేలు.
* ఆఫీస్ లేదా ఏదైనా ఇంటర్వ్యూకు వెళుతున్న సందర్భంలో అక్కడకు చేరుకున్న తరువాత తల దువ్వుకోవడానికి ముందుగానే దువ్వెన, రబ్బరుబ్యాండ్ వేసుకుంటే సమయానికి ఉపయోగపడతాయి.