DailyDose

మాది మధురమైన మైత్రి-తాజావార్తలు

Trump Speaks At Press Conference In India-Telugu Breaking News Roundup Today

* భారత్‌లో తన రెండు రోజుల పర్యటన మధురానుభూతిని కలిగించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక బంధాలపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. భారత్‌ అద్భుతమైన దేశమనీ.. ప్రధాని మోదీతో బలమైన మైత్రి ఏర్పడిందన్నారు. భారత్‌లో జరుగుతున్న కొన్ని ఘటనలు ఈ దేశ అంతర్గతమని.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రధాని మోదీతో తాను చర్చించలేదని ట్రంప్‌ స్పష్టంచేశారు.

* పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. కానీ అసెన్డ్‌ భూములను లాక్కునే అధికారం ఎవరిచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖలో 6వేల ఎకరాల అసైన్డ్‌ భూములను లాక్కున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఆందోళనకరంగా ఉందని.. రూ.లక్షా 13వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ చర్యలతో సోలార్‌ ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయన్నారు.

* రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రారంభమైంది. తొలిసారి రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కాసేపు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను ట్రంప్‌ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరచాలనం చేశారు. కాసేపు ఆయనతో మాట్లాడారు.

* కరోనా వైరస్‌ దెబ్బకు చైనాలో రసాయన కర్మాగారాలు మూతపడటంతో ఆ మేరకు ఆర్డర్లు భారత్‌కు మళ్లుతున్నాయి. ఒళ్లునొప్పులకు ఉపయోగించే ఐబుప్రొఫెన్‌ అతిపెద్ద ఉత్పత్తిదారైన ఐవోఎల్‌ కెమికల్స్‌ విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. గత రెండున్నరేళ్లలో ఎన్నడూ లేనంత డిమాండ్‌ వచ్చింది. చైనాలో హుబె ప్రావిన్స్‌లో కూడా దీనిని ఉత్పత్తి చేస్తారు. కానీ, ఆ ప్రాంతంలో కరోనా ప్రభావం కారణంగా చాలా రోజులుగా దీని తయారీ ప్లాంట్లు మూతపడ్డాయి.

* పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో ఈశాన్య దిల్లీ అట్టుడుకుతోంది. పలుచోట్ల చెలరేగిన హింసాత్మక ఘటనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ హింసలో ఇప్పటివరకు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 186 మందికి పైగా గాయపడటంతో వారిని జీటీబీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 130 మంది పౌరులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై దిల్లీ పోలీసులు మొత్తం 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

* నగర శివారులో భారీగా బంగారాన్ని డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రైవేట్‌ బస్సులో అక్రమంగా బంగారం తరలిస్తు్న్నట్లు సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న 31 విదేశీ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3.09 కిలోల ఈ బంగారం విలువ రూ.1.38 కోట్లుగా అధికారులు అంచనా చేశారు.

* చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ‘ఐక్యూ’ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఐక్యూ3 పేరుతో మంగళవారం భారత మార్కెట్‌లోకి తొలి మొబైల్‌ను విడుదల చేసింది. ఆ సంస్థ నుంచి విడుదలైన తొలి 5జీ ఫోన్‌ ఇదే. అయితే మన దేశంలో రెండోది. రియల్‌మీ ‘50ఎక్స్‌ ప్రో’ పేరుతో తొలి 5జీ మొబైల్‌ను సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. 4జీ, 5జీ వేరియంట్లలో లభించనున్న ఈ ఫోన్‌ ప్రారంభ ధరను రూ.36,990గా నిర్ణయించారు.

* బంగ్లాదేశ్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ఆసియా ఎలెవన్‌ × వరల్డ్‌ ఎలెవన్‌ మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) జట్లను ప్రకటించింది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మన్ 100వ జయంతి వేడుకల సందర్భంగా మార్చి 18 నుంచి 22 వరకు ఆసియా ఎలెవన్‌, వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య బీసీబీ టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తుంది. ఆసియా ఎలెవన్‌కు భారత్‌ నుంచి ఆరుగురు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిలో సారథి విరాట్‌ కోహ్లీ, కేఎల్ రాహుల్‌, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌, పేసర్‌ మహ్మద్‌ షమి, స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఉన్నారు.

* చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులకు శుభవార్త! ఆ జట్టు సారథి ఎంఎస్‌ ధోనీ మార్చి 2 నుంచి ఎంఏ చిదంబరం స్టేడియంలో క్రికెట్‌ సాధన చేయనున్నాడు. ఆ జట్టు యాజమాన్యం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. సీనియర్‌ ఆటగాళ్లు సురేశ్‌ రైనా, అంబటి రాయుడుతో కలిసి మహీ శిక్షణలో పాల్గొంటాడని తెలిసింది. ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ఓటమి పాలైన తర్వాత అతడు మైదానంలో అడుగుపెట్టలేదు. కొన్నాళ్ల క్రితం ఝార్ఖండ్‌ జట్టుతో కలిసి ఓ వారం సాధన చేశాడు.

* భారతీయ స్టేట్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ విభాగం ఎస్బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ(ఐపీవో) షేరు ధరను ప్రకటించింది. షేరు ధర దాదాపు రూ.750-755 పరిధిలో ఉండనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం నిర్ణయించిన షేరు ధరపై అర్హత గల ఉద్యోగులకు రూ.75 డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ సెబీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూ ద్వారా ఎస్బీఐ కార్డ్స్‌ రూ.9వేల కోట్లను సమీకరించనుంది.