NRI-NRT

లివర్‌మోర్ శివాలయంలో త్రిశక్తి యాగం

Trisakthi Yagam In Livermore Siva Temple

కాలిఫోర్నియాలోని లివర్‌మోర్‌ నగరం శివ-విష్ణు ఆలయంలో త్రిశక్తి యాగం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. మార్చి 5 నుంచి 8 వరకు జరిగే ఈ కార్యక్రమానికి భారీ సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు త్రిశక్తి స్వరూపిణి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ యాగానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వేద పండితుల సమక్షంలో ఐదు కాలాల్లో శ్రీ సూక్తం, ధర్మాసూక్తం, మేధా సూక్తం 1440 సార్లు పఠిస్తూ యాగం నిర్వహించాలని సంకల్పించినట్టు నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా రోజుకో విశేష పూజా కార్యక్రమం జరగనుంది. అమ్మవారికి ప్రీతిపాత్రమైన సహస్ర సువాసిని పూజను 1008 మంది మహిళలతో నిర్వహిస్తున్నారు. బే ఏరియాలో ఉన్న మహిళలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ యాగంలో భాగంగా గణపతి పూజ, విశ్వక్సేన పూజ, పుణ్య వచనం, పంచగవ్య ప్రసన్నం, కూష్మాండ హోమం, భూమిపూజ, వాస్తు హోమం, యాగశాల ప్రవేశం, అభిషేకం, మహా పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తరలి రావాలని ప్రవాస భారతీయులకు హిందూ కమ్యూనిటీ అండ్‌ కల్చరల్‌ సెటర్‌ విజ్ఞప్తి చేసింది. త్రిశక్తి యాగం షెడ్యూల్‌, పూజా కార్యక్రమాలు, సహస్ర సువాసిని పూజకు రిజిస్ట్రేషన్‌, వాలంటీర్‌ రిజిస్ట్రేషన్‌ తదితర వివరాలకు సంబంధించిన సమాచారాన్ని https://livermoretemple.org/hints/trishakti-yaagam/index.html#featured వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.