* దిల్లీలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ఢోబాల్ అన్నారు. ఈశాన్య దిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఆయన పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, పోలీసులు వారి పని వారు చేస్తున్నారని పేర్కొన్నారు.
* టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీకి షాక్ (906 రేటింగ్ పాయింట్లు)! ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానం చేజార్చుకున్నాడు. రెండుకు పడిపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అతడు కేవలం 21 పరుగులు మాత్రమే చేయడం ఇందుకు కారణం. అజింక్య రహానె, చెతేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్ టాప్-10లో నిలిచారు. ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్ (911) మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
* ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను భాజపా తిప్పికొట్టింది. అమాయక సిక్కుల రక్తంతో తడిసిన చేతులు వాళ్లవని, అలాంటి వారు ఇవాళ హింస గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించింది. ఈశాన్య దిల్లీలో హింసకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సోనియా డిమాండ్ చేయడాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ తప్పుబట్టారు.
* కార్మికుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. సాంబమూర్తి నగర్‌లో రూ.110కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రికి గంగ్వార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
* అంతర్జాతీయ టెన్నిస్ తార మరియా షరపోవా అందరినీ విస్మయపరిచింది. అనిర్వచనీయ ఆనందాలను, కనిపించని కన్నీటిని కలిగించిన ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించింది. ఇకపై కోర్టులో అడుగుపెట్టడం లేదని వానిటీఫెయిర్ వెబ్‌సైట్‌కు తెలిపింది. ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌గా తళుకులీనిన షరపోవా 373వ ర్యాంకుతో కెరీర్‌ను ముగించడం గమనార్హం. తీవ్రమైన భుజం నొప్పి, సమస్యలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
* విశాఖపట్నంలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 140 కి.మీ. మేర లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్ల ఏర్పాటుకు డీపీఆర్‌ల తయారీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీపీఆర్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రైట్స్, డీఎంఆర్సీ ముందుకొచ్చాయి. రెండు దశల్లో లైట్ మెట్రో కారిడార్, 3 కారిడార్లుగా ట్రామ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* బెయిల్ నిబంధనలను ఉల్లఘించిన కారణంగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పరారీలో ఉన్న నిందితుడిగా పరిగణిస్తూ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని ఫెడరల్ కేబినెట్ ప్రకటించింది. దానితో పాటు ప్రభుత్వం తరపున ఆయనకు అందిస్తున్న గ్యాస్, విద్యుత్ వంటి సదుపాయాలను నాలుగు నెలలపాటు నిలిపివేయాలని నిర్ణయించింది.
* దిల్లీ శాసనసభ ఎన్నికల నుంచే దేశ రాజధానిలో అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. భాజపా నేతలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో హింస చెలరేగిన ఈశాన్య దిల్లీలో సాధారణ పరిస్థితి తీసుకురావడంలో దిల్లీ పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు.
* భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరికొత్త సేవలను ప్రారంభించింది. వినియోగదారులకు వాహన సంబంధించిన బీమా పాలసీలు, రెన్యూవల్ ప్రీమియం డాక్యూమెంట్లు వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా అందించే సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు బుధవారం వెల్లడించింది. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ వేదికగా జీవిత బీమాయేతర సదుపాయాలు అందిస్తున్న తొలి కంపెనీగా భారతీ యాక్సా రికార్డు సృష్టించినట్లు సంస్థ పేర్కొంది.
* ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్‌తో ముందుకొచ్చింది. ఫోన్లపై డిస్కౌంట్‌తో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్- 2020 సేల్‌ను ప్రకటించింది. నేటి నుంచి (ఫిబ్రవరి 26 నుంచి) ఈ నెల 29 వరకు ఈ సేల్ నడవనుంది. ఇందులో మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్‌పై ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, కొటాక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు యూజర్లు 10 శాతం అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.