Politics

బాబును భాగ్యనగరి విమానం ఎక్కించిన పోలీసులు

Chandrababu Made To Board Hyderabad Flight In Vizag

హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రబాబు. విశాఖపట్నం: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. శాంతిభద్రతల దృష్ట్యా తిరిగి వెళ్లాలని చంద్రబాబుకు పోలీసులు సూచించారు. పోలీసుల సూచనతో విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. చంద్రబాబు వెళ్లడంతో విమానాశ్రయం నుంచి తెదేపా నేతలు బయటకు వచ్చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద చంద్రబాబును అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ఆయన్ను నిర్బంధింలోనే ఉంచాలని పోలీసులు యోచిస్తున్నారు. ఆయనతో పాటు ఉన్న టీడీపీ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం నుంచి ఎయిర్‌పోర్టు వద్ద హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈ ఉదయం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా తరలివచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు, నేతల నినాదాలతో వాతావరణ ఒక్కసారిగా హీటెక్కింది. చంద్రబాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమోటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కొన్ని గంటల పాటు చంద్రబాబు వాహనంలోనే ఉండి పోయారు. నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.