Food

నొప్పి పోగొట్టే గచ్చకాయ

Fevernut Powder Relieves Pain-Telugu Food And Diet News

గచ్చకాయ… అంటే చాలామంది అదేదో అరగదీస్తే వేడిగా అయిపోయే రాయి అనే అనుకుంటారు. కానీ అదో చెట్టు విత్తనం. దీన్నే ఫీవర్‌నట్‌ అనీ పిలుస్తారు. ముళ్లు ఎక్కువగా ఉండే ఈ చెట్లను కంచెగా వేస్తే పంటపొలాల్లోకి ఉడతలు రావట. ఇందులో అద్భుతమైన ఔషధగుణాలు ఉండటంతో ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా గర్భాశయ సమస్యలకి ఇది మంచి మందు. నెలసరిలో భాగంగా వచ్చే పొట్ట నొప్పికి ఈ గింజల్ని వేయించి పొడి చేసి నేతితో కలిపి ఇస్తే నొప్పి తగ్గుతుందట. ఒకలాంటి చేదు రుచితో ఉండే ఈ కాయని కఫ, వాత దోష నివారణకి ఉపయోగిస్తారు. ఇంకా కాలేయం, ప్లీహం, నులిపురుగుల సమస్యలకీ దీన్ని వాడుతుంటారు. ఈ గింజల నుంచి తీసిన నూనెతో మర్దన చేస్తే కీళ్ల సమస్యలూ తగ్గుతాయి. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తే ఈ గింజల్ని ముద్దలా చేసి తేనెతో తీసుకుంటే తగ్గుతుందట. ఇంకా డయేరియా, డీసెంట్రీ, చర్మ వ్యాధులు, ఆస్తమా, దగ్గు, నులిపురుగులు, మధుమేహం, జ్వరం… ఇలా రకరకాల వ్యాధుల నివారణలో గచ్చకాయల్ని వాడుతుంటారు. ముఖ్యంగా మలేరియా జ్వరానికి ఇది అద్భుతమైన మందు అని చెబుతారు ఆయుర్వేద నిపుణులు.