Sports

నా బాదుడికి కారణం…అబ్బాయిలే!

Indian Women Cricketer Shefali Speaks Of Her Hard Hitting

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. కఠిన ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను ఓడించి గురువారం హ్యాట్రిక్‌ విజయం అందుకుంది. యువకిషోరం, పదహారేళ్ల డ్యాషింగ్‌ ఓపెనర్‌ షెఫాలీ వర్మ ధనాధన్‌ మెరుపులతోనే హర్మన్‌సేనకు ఈ విజయాలు సాధ్యమయ్యాయి. అందుకే ఆమె వరుసగా ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డును రెండోసారి సాధించింది. కళ్లు చెదిరే సిక్సర్లు, భారీ బౌండరీలు బాదుతున్న షెఫాలీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అమ్మాయిల టీ20ల్లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ ఉన్న బ్యాటర్‌గా చరిత్రకెక్కింది. ఇప్పటి వరకు ఆమె 147.97 స్ట్రైక్‌రేట్‌తో 438 పరుగులు చేసింది. క్లోయి ట్రయాన్‌ 138.31 (722 పరుగులు), అలిసా హేలీ 129.66 (1,875) స్ట్రైక్‌రేట్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కనీసం 200 పరుగులను ఈ గణాంకాలకు ఆధారంగా చేసుకున్నారు. ఒకే టీ20 ప్రపంచకప్‌లో ఆమె కన్నా ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో మరెవ్వరూ పరుగులు చేయకపోవడం విశేషం. ఈ మెగాటోర్నీలో ఆమె 172.72 స్ట్రైక్‌రేట్‌తో 114 పరుగులతో అదరగొట్టింది. పవర్‌ప్లేలో మెరుపు షాట్లతో టీమ్‌ఇండియాకు అద్భుతమైన శుభారంభాలు అందిస్తున్నందుకు షెఫాలీ వర్మ ఆనందం వ్యక్తం చేసింది. కివీస్‌ పోరులో మొదట చెత్త బంతుల కోసం వేచిచూశానని తెలిపింది. అలాంటి బంతుల్ని చితకబాదడం తన బలమని వెల్లడించింది. ‘నేను ఎక్కువగా అబ్బాయిలతో సాధన చేసేదాన్ని. అందుకే మా నాన్న, నాతో సాధన చేసిన అబ్బాయిలకు కృతజ్ఞతలు. వాళ్ల వల్లే నేను బాగా శిక్షణ పొందాను. చక్కగా బ్యాటింగ్‌ చేస్తున్నాను’ అని షెఫాలీ తెలిపింది. టీమ్‌ఇండియా ఈ ప్రపంచకప్‌ గెలవాలంటే ఆమె ఇకపై ఇలాంటి శుభారంభాలే ఇవ్వాలి.