బాధ కలిగితే కన్నీళ్లు పెట్టుకుంటారు. భావావేశంతోనూ కన్నీళ్లు వస్తాయి. కారణాలు ఏవైనా కన్నీళ్లు పెట్టుకునే విషయంలో స్త్రీలే ముందుంటారు. పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ దుఃఖపడతారు అంటున్నాయి అధ్యయనాలు. స్త్రీలే ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటారు అంటే వాళ్లు చాలా సున్నితమైన మనసు కలవాళ్లు అంటారు. కన్నీళ్లు పెట్టుకుని ఆ సంఘటనను వెంటనే మరచిపోతారట. పురుషులు మటుకు అలా వెంటనే స్పందించరు కానీ ఆ దుఃఖాన్ని, ఆ సమయాన్ని అంత తేలిగ్గా మరచిపోరట. పురుషులతో పోలిస్తే మహిళలకు సెంటిమెంట్లు ఎక్కువ అంటారు. ప్రతిచిన్న విషయాన్ని మనసుకి దగ్గరగా తీసుకుంటారు. మంచైనా చెడైనా వెంటనే కళ్ల నీళ్లు పెట్టేసుకుంటారు. కానీ అంతమాత్రన వాళ్లు బలహీనులైతే కాదు. ఒక పరిశోధనలో కొన్ని సెకండ్ల పాటు కన్నీరు కార్చటం వల్ల మనసులో రేగే వ్యతిరేక భావనలు బయటకి వచ్చేస్తాయని, దాని స్థానంలో మంచి ఆలోచనలు చోటు చేసుకుంటాయని, దుఃఖం తరువాత స్త్రీలు చాలా తొందరగా ఆవేదనలోంచి తేరుకుంటారని తేలింది.కొన్ని వందల మంది స్త్రీల పైన ఈ పరిశోధన చేశారు. ఆడవాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నాక వారి మానసిక పరిస్థితీ, ఆలోచనా ధోరణిని పరిశోధించారు. అంత వరకూ ప్రతికూలంగా ఉన్న ఆలోచనాధోరణి సానుకూలంగా మారటం పరిశోధకులు గుర్తించారు. అందువల్ల కన్నీళ్ల వల్ల ఒక రకంగా లాభమేనని తేల్చారు. భావావేశం వల్ల వచ్చిన కన్నీళ్లు ఆందోళన తగ్గిస్తాయి. భరించలేని బాధ కలిగితే అదొక ఒత్తిడీ, ఆందోళన కలుగుతాయి. కన్నీళ్లు ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతత ఇస్తాయి. కన్నీళ్ల ద్వారా టాక్సిక్ కెమికల్స్ శరీరం నుంచి బయటకు వెళతాయి. అలాగే కళ్లలో చేరిన దుమ్ము, ధూళి కూడా కన్నీళ్ల ద్వారా బయటకు పోయి కళ్లు తేటగా ఉంటాయి.కన్నీళ్లు మానసిక ఆరోగ్యానికి మంచివే. అయినా ప్రతి చిన్న దానికీ కన్నీళ్లు పెట్టుకోవటం అనారోగ్యం అంటున్నారు నిపుణులు. మానసిక ప్రశాంతత లేకనే తరచూ కన్నీళ్లు పెట్టుకుంటారని, ప్రతి చిన్న దానికి తీవ్రంగా స్పందిస్తూ ఉంటే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. సాధారణంగా టీనేజ్ వచ్చే వరకు ఆడ, మగ పిల్లల్లో ఈ కన్నీళ్లు రావటం సమానంగా ఉంటాయి. పన్నెండు, పదమూడు సంవత్సరాలు వచ్చేవరకు టీనేజర్స్ ఒకే లాగా దుఃఖానికి కన్నీళ్లు పెట్టుకుని, తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ మగపిల్లల్లో మార్పు వస్తుంది. ఏడవటం అనే ప్రక్రియకు వాళ్లు దూరం అవుతారు. శరీరంలో కలిగే మార్పులతో పాటు హార్మోన్లు కూడా ఈ విషయంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే ఒక సంవత్సర సమయంలో స్త్రీలు కనీసం 47 సార్లు విపరీతమైన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటే, పురుషులు ఏడుసార్లు మాత్రమే ఏడుస్తారు. స్త్రీలు సగటున ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు విపరీతంగా దుఃఖపడితే, పురుషులు రెండు నుంచి మూడు నిమిషాలు ఏడుస్తారట. డాక్టర్ల బృందంతో కలిసి చేసిన ఒక పరిశోధనలో స్త్రీల కన్నా పురుషులు అనారోగ్యానికి గురి కావటం బహుశా వాళ్లు మనసారా దుఃఖ పడకపోవటమేనని తేలింది. స్త్రీలు ఏడ్చిన ప్రతిసారీ గతించిన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటే, పురుషులు అలాంటి పని ఎప్పుడూ చేయరట. వాళ్లు గతాన్ని చాలా తేలికగా మర్చిపోవటం కావచ్చు. స్త్రీలు రుతుక్రమ సమయంలో మరింత తేలిగ్గా భావోద్వేగానికి లోనవుతారని వైద్యులు చెబుతున్నారు.కన్నీళ్లు ఆరోగ్యానికి మంచివే కావచ్చు. కానీ చీటికి మాటికీ అన్నీ సందర్బాల్లో అది సమస్యే అంటున్నాయి అధ్యయనాలు. స్త్రీలను కూడా ఈ విషయంలో కాస్త నియంత్రించుకోమని సలహా ఇస్తున్నారు. బాధను స్నేహితులతో పంచుకోండి. రిలాక్సేషన్ పద్ధతులపైన మనసు పెట్టండి. కన్నీటికి కారణం అయిన విషయం గురించి మనసులో విశ్లేషణ చేసుకుం టే కన్నీరు రావటం తగ్గుతుంది కూడా అంటున్నారు పరిశోధకులు.
మహిళలకు కన్నీళ్లు ఎందుకు ఎక్కువ?
Related tags :