ఎన్నారై సంబంధం… అబ్బాయికి విదేశంలో పెద్ద ఉద్యోగం… ఆరంకెల జీతం… ఇంకేం… అమ్మాయి తల్లిదండ్రుల్లో పట్టలేని ఆనందం. కూతురి జీవితం వైభవోపేతంగా సాగిపోతుందని కలలు కంటారు. అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోగానే, పది రోజుల్లోనే పెళ్లిచూపుల నుంచి మొదలుకొని పెళ్లి తంతు వరకు అంతా పూర్తి చేసేస్తారు.తీరా పెళ్లయ్యాక… భార్యను వీసా వచ్చాక తీసుకెళ్తానంటూ అబ్బాయి విమానం ఎక్కేస్తాడు. అక్కడి నుంచి ఉలుకూ పలుకూ ఉండదు. కనీసం ఫోన్ కూడా చేయడు. ఒకవేళ భార్యను వెంటబెట్టుకుని వెళ్లినా, కాపురం సజావుగా సాగదు. ఆమెతో మాటైనా మాట్లాడడు. ఏం జరిగిందో తెలియని అమ్మాయి కొన్నాళ్లు మథనపడి… తల్లితండ్రులకు చెబుతుంది. అప్పుడు గానీ వారు మోసపోయామని గుర్తించలేకపోతున్నారు. కూతురి కాపురం నిలబెట్టాలని మహిళా భద్రత విభాగం తలుపు తడుతున్నారు. అన్నీ కాకపోయినా… ఎన్నారై పెళ్లిళ్లపై వివాదాలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. ఇలా ఇప్పటివరకు నమోదైన 551 కేసుల్లో చాలా వరకు అబ్బాయిలకు ఇష్టం లేని పెళ్లిళ్లేనని వెల్లడవుతోంది.
*ఇష్టాయిష్టాలకు తావెక్కడ?:
ఎన్నారై సంబంధాల్లో తలెత్తే వివాదాలకు ఎక్కువ శాతం అబ్బాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడమే కారణమని తేలుతోంది. దూరదేశంలో ఉన్న కుమారుడికి పెళ్లి చేసేయాలన్న ఆత్రుతలో తల్లిదండ్రులు అతడిని తీవ్రంగా ఒత్తిడి చేసి బలవంతంగా ఒప్పిస్తారు. అబ్బాయి తల్లిదండ్రులే ఇక్కడ అమ్మాయి సంబంధీకులతో మాటామంతీ కానిచ్చేస్తున్నారు. అబ్బాయి పది రోజులో, నెల రోజులో సెలవుపై వస్తే… ఆ విరామంలోనే పెళ్లి తంతు ముగించేస్తున్నారు. కొన్ని కేసులను పరిశీలిస్తే… విదేశంలో ఉన్న అబ్బాయిలకు పెళ్లి నాటికే వేరే అమ్మాయిలతో సంబంధాలుండటం విభేదాలకు కారణమవుతోంది.
*విదేశీ ఎంబసీలతో సంప్రదింపులు
గతంలో ఎన్నారై అల్లుళ్లపై ఫిర్యాదులొస్తే దర్యాప్తులో పెద్దగా పురోగతి ఉండేది కాదు. ఐజీ స్వాతి లక్రా నేతృత్వంలో తెలంగాణ మహిళా భద్రత విభాగం ఏర్పాటయ్యాక రాష్ట్రవ్యాప్తంగా ఠాణాల్లో నమోదవుతున్న ఈ తరహా కేసులన్నింటినీ ఈ విభాగమే పర్యవేక్షిస్తోంది. న్యాయసలహాలతో పాటు విదేశీ ఎంబసీలు, విదేశీ వ్యవహారాల శాఖ, జాతీయ మహిళా కమిషన్, స్వచ్ఛంద సంస్థలతో సంప్రదింపులు జరిపేందుకు అవసరమైన సహకారం అందిస్తోంది. తొలుత నిందితుడిని ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయడంతో పాటు అతడి కుటుంబసభ్యులను సంప్రదించి కాపురం నిలబెట్టేందుకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. దారికి రాకపోతే కేసు పెట్టి విమానాశ్రయాలకు లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీతో పాటు విదేశీ ఎంబసీలకు సమాచారమిస్తున్నారు. విదేశాల్లోని స్వచ్ఛంద సంస్థలతో సంప్రదించి ఎన్నారైని ఇక్కడికి రప్పించే యత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చాక రాజీ కుదిరితే లోక్అదాలత్లో కేసు ముగిసేలా చర్యలు తీసుకుంటున్నారు. కోర్టులో కేసు విచారణ జరగాలంటే నిందితుడి హాజరు తప్పనిసరి కాబట్టి విదేశాల నుంచి రప్పించడానికి ప్రాధాన్యమిస్తున్నారు.
ఎన్నారై పెళ్లి సంబంధాలు చెదిరిపోతున్నాయి
Related tags :