Editorials

విహార యాత్రలకు వెళ్ళండి…మోడిని డబ్బులు అడగండి

Modi Government To Reimburse Tourism Expenses

‘సుసంపన్నమైన, బహు విధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం’ బడిలో రోజూ ప్రతిజ్ఞలో చెప్పేవాళ్లం గుర్తుందా? ఇప్పుడు పర్యాటక భారతం మరో ప్రతిజ్ఞకు పూనుకుంటోంది. ‘సువిశాలమైన, బహు సుందరమైన నా దేశ పర్యాటక సంపద నాకు గర్వకారణం’ అని చెబుతున్నారంతా! నచ్చిన ప్రదేశాలన్నీ చూసొస్తామని మాటిస్తున్నారు. మరి డబ్బులో! అంటారా? ముందుగా నచ్చిన ప్రదేశాలు చూసొస్తే సరి! తర్వాత ఖర్చులు ఇచ్చేస్తామంటోంది ప్రభుత్వం. ‘దేఖో అప్నా దేశ్‌’ ప్రచారంలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ ఈ అవకాశం కల్పిస్తోంది.
**ఏమిటీ దేఖో అప్నా దేశ్‌?
దేశంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ప్రధాని సంకల్పించిన వినూత్న విధానమిది. 2022 నాటికి దేశంలో ఉన్న ఏవైనా 15 ప్రముఖ విహార కేంద్రాలు చుట్టిరావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్తూ పర్యాటకశాఖ ‘దేఖో అప్నా దేశ్‌’కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పదిహేను పర్యాటక కేంద్రాలు చుట్టిరావాలి. ఆ చిట్టా పర్యాటక శాఖకు నివేదించాలి. ప్రయాణ ఖర్చులు యాత్రికులకు అందజేస్తారు.
**ప్రతిజ్ఞ తీసుకోవడం ఎలా?
ముందుగా pledge.mygov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో భాషను ఎంచుకోవాలి. మీ వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రతిజ్ఞ తీసుకోవాలి. దానికి సంబంధించిన ధ్రువపత్రం మీ చరవాణికి, ఈమెయిల్‌కి వస్తుంది. ఇక ప్రయాణం మొదలుపెట్టడమే తరువాయి. 2022 నాటికి యాత్ర పూర్తి చేయాలి. ఆ వివరాలను మళ్లీ వెబ్‌సైట్‌లో ఉంచాలి.
**ఏ ప్రదేశాలు?
ఇప్పటికైతే పర్యాటక కేంద్రాల వివరాలు ఏమీ ప్రకటించలేదు. త్వరలోనే వెల్లడించనున్నారు. వెబ్‌సైట్‌లో ఉంచే ప్రాంతాల్లో మీకు నచ్చిన పదిహేను ప్రదేశాలు తిరిగి రావాల్సి ఉంటుంది. ఆయా ప్రదేశాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు నడిపే యోచన కూడా ఉంది. ఇప్పటికే దాదాపు 55వేల మంది ఈ ప్రతిజ్ఞ తీసుకున్నారు.