Movies

నన్ను నేను ప్రేమించడం నేర్చుకున్నాను

Shruti Hassan Responds On Plastic Surgery And Self Love

ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కథానాయిక శ్రుతిహాసన్‌. కొంతకాలం విరామం తీసుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండే శ్రుతిహాసన్‌ తాజాగా ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను పంచుకుంది. అందులో సన్నగా, బక్క పల్చగా అయిపోయిన శ్రుతిని చూసి, కొందరు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దీంతో వారికి ఘాటుగా సమాధానం ఇస్తూ శ్రుతి మరో పోస్ట్‌ పెట్టింది. తాను గతంలో ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నానని, ఎవరో చెప్పినట్లు తాను జీవించనని పేర్కొంది.‘‘నేను ఈ పోస్ట్‌ చేయడం వెనుక కారణం ఉంది. ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా నేను నడుచుకోవాల్సిన అవసరం లేదు. ‘ఆమె ఒకప్పుడు లావుగా ఉండేది. ఇప్పుడు చాలా సన్నగా ఉంది’ అంటూ వరుస కామెంట్లు చేయడం సరైనది కాదు. ఈ రెండు ఫొటోలు మూడు రోజుల కిందట తీసినవి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్రతి మహిళా ఎదుర్కొనేదే. హార్మోన్ల సమస్య కారణంగా తరచూ శారీరకంగా, మానసికంగా నేను ఇబ్బంది పడుతున్నా. గత కొన్నేళ్లుగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో కష్టపడుతున్నా. అదేమీ అంత సులభం కాదు. శారీరకమార్పుల వెనుక కష్టం మామూలుగా ఉండదు. కానీ, నా జర్నీ గురించి చెప్పడం చాలా సులువు. ఒకరి స్థాయిని మరొకరు నిర్ణయించలేరు. ఇది నా జీవితం.. నా ముఖం. ఈ విషయాన్ని చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను గతంలో ప్లాస్టిక్‌సర్జరీ చేయించుకున్నా. దీని గురించి ఎప్పుడైనా ప్రచారం చేసుకున్నానా? లేదు. అలాంటివి నాకు ఇష్టం ఉండదు. నేను ఎలా జీవించాలో అలాగే జీవిస్తా. మనకు మనం చేసుకునే మంచి ఏదైనా ఉందంటే, మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ప్రేమను పంచండి. నిత్యం నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకుంటున్నా. మీరూ అలాగే చేయండి’’ అని చెప్పుకొచ్చింది