Sports

శ్రీలంకను చిత్తు చేసిన భారత మహిళలు

2020 T20 Women's World Cup-India Wins Against Sri Lanka

షెఫాలీ వర్మ (47, 34 బంతుల్లో; 7×4, 1×6) బ్యాటుతో, రాధా యాదవ్‌ (4/23) బంతితో సత్తా చాటడంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన మరో ఘన విజయం సాధించింది. శనివారం మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లంకపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. లంక సారథి ఆటపట్టు (33, 24 బంతుల్లో; 5×4, 1×6), దిల్షారి (25*, 16 బంతుల్లో; 2×4) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ 14.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాధా యాదవ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ దక్కింది. ఈ విజయంతో ప్రపంచకప్‌ గ్రూప్‌-ఎ పట్టికలో టీమ్‌ఇండియా ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో టీమ్‌ఇండియా సెమీస్‌లో తలపడుతుంది.
***ఆది నుంచే మోతే..
షెఫాలీ వర్మ తన సూపర్‌ ఫామ్‌ను మరోసారి కొనసాగించింది. శ్రీలంక బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడింది. ఆమెకి తోడుగా స్మృతి (17, 12 బంతుల్లో; 3×4) కూడా మెరవడంతో భారత్‌కు మంచి ఆరంభమే దక్కింది. అయితే స్మృతిని ప్రబోధని ఔట్‌ చెయ్యడంతో 34 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (15; 14 బంతుల్లో; 2×4, 1×6)తో కలిసి షెఫాలీ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. వీరిద్దరు కలిసి లంక బౌలర్లు సమర్థవంతంగా ఎదుర్కొని లక్ష్యాన్ని కరిగించారు. అయితే ఆటపట్టు బౌలింగ్‌లో వరుసగా ఫోర్‌, సిక్సర్‌, ఫోర్‌ బాది ఊపు మీదున్న హర్మన్‌ప్రీత్‌ను శశికల బోల్తా కొట్టించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే షెఫాలీ కూడా రనౌట్‌ అవ్వడంతో స్వల్ప వ్యవధిలోనే టీమ్‌ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి శర్మ (15, 13 బంతుల్లో; 2×4).. జెమీమా రోడ్రిగ్స్‌ (15, 15 బంతుల్లో; 1×4)తో కలిసి మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చింది.