ఐరోపా ఖండంలోని అతిచిన్న దేశమైన లగ్జెంబర్గ్.. వాయు కాలుష్యం, ట్రాఫిక్ జామ్‌లను అరికట్టేందుకు పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రజలందరికీ ఉచిత రవాణా సౌకర్యం అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 29 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆ దేశ రవాణా మంత్రి వెల్లడించారు. ప్రపంచంలోనే ఇలాంటి సౌకర్యం కల్పిస్తున్న తొలి దేశం లగ్జెంబర్గే కావడం విశేషం. ఈ నిర్ణయం వల్ల ప్రతి వ్యక్తికి ఏటా దాదాపు 100 యూరోలు ఆదా అవుతుందట. అయితే ఈ ఉచిత ప్రజా రవాణా వ్యవస్థలో కొన్ని సేవలను మినహాయించారు. రైళ్లలో ఫస్ట్ క్లాస్ ప్రయాణం, రాత్రి వేళల్లో బస్సు సర్వీసులకు ఈ ‘ఉచితం’ వర్తించదు. లగ్జెంబర్గ్.. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మధ్య ఉంటుంది. ఈ మూడు దేశాల నుంచి ప్రతి రోజూ దాదాపు 2 లక్షల మంది ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం లగ్జెంబర్గ్‌కు వస్తుంటారు. అంతేగాక.. ఇక్కడ ప్రజా రవాణాను ఉపయోగించేవారు చాలా తక్కువట. 2018లో చేపట్టిన ఓ సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 32శాతం మంది బస్సుల్లో, 19శాతం మంది మాత్రమే రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు తేలింది. మిగతా వారంతా తమ ప్రయాణాలకు కార్లు, సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీంతో కాలుష్య స్థాయిలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో లగ్జెంబర్గ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్ ఖర్చు లేకపోతే ప్రజలంతా ప్రజా రవాణాను ఉపయోగిస్తారని అక్కడి అధికారులు భావించి ఈ ఉచిత రవాణాను అందుబాటులోకి తెచ్చారు.
లగ్జెంబర్గ్‌లో ఉచిత రవాణా
Related tags :