Politics

ప్రత్తిపాటి వియ్యంకుడి ఇంట్లో సోదాలు

SIT Raid Prattipati In-Law Homes Over Amaravati Land Purchases

తెదేపాకు చెందిన మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వియ్యంకుడు బసవయ్య ఇంటితో పాటు, మరో ఇద్దరు వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. దాదాపు నాలుగైదు గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. రాజధాని ప్రాంతంలో కొన్న భూములు, వాటి లావాదేవీలపై వారిని సిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సోదాలు జరిగిన మరో ఇద్దరు వ్యక్తుల్లో ఓ బిల్డర్‌ ఉన్నారు. 2015లో ఆయన రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. ఈ లావాదేవీలపై ఆయన్ను ఆరా తీశారు. మాజీమంత్రితో మీకు సంబంధాలేమిటి? ఆయనకు మీరు బినామీయా? అని ప్రశ్నించినట్లు సమాచారం. తానెవరికీ బినామీని కాదని ఆయన సమాధానమిచ్చినట్లు తెలిసింది. పటమటలంకలోని బిల్డర్‌ నివాసంలో, పాలీక్లినిక్‌ రోడ్డులోని ఆయన కార్యాలయంలో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. సిట్‌ అధికారులు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారన్న అభియోగంతో గుంటూరు జిల్లాలో ఓ వడ్రంగి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. తాడికొండ మండలం పొన్నేకల్లుకు చెందిన షేక్‌ సుభాని ఇంటికి శుక్రవారం ఉదయం 7 గంటలకు చేరుకున్న పోలీసు బృందం.. సెర్చ్‌వారెంట్‌ చూపించి సోదాలు ప్రారంభించారు. ఇవి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగాయి. రెండు ఖాళీ ప్రామిసరీ నోట్లు, రూ.10 నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపు పేపరు, రెండు బ్యాంకు పాస్‌పుస్తకాలు, సుభాని ఆధార్‌కార్డు, పాన్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీలు నమోదు చేసుకున్నారు. సుభాని 2014 నుంచి 2018 వరకు తాడికొండ, పొన్నేకల్లు గ్రామాల్లో చిన్నపాటి స్థల క్రయ, విక్రయాలు జరిపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పిడుగురాళ్ల నుంచి రూ.2.50 లక్షల పోస్టు డేటెడ్‌ చెక్కు ఆయనకు వచ్చినట్లు బయటపడింది. తాడికొండ అడ్డరోడ్డులో 135 గజాల స్థలం అమ్మకానికి సంబంధించిన దస్తావేజు నకళ్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో సుభాని ఇంట్లో లేరు. పోలీసులు తిరిగి వెళ్లేటప్పుడు ఇంటికి చేరుకున్నారు.