DailyDose

బాలల అక్రమ రవాణా నిరోధించిన పోలీసులు-నేరవార్తలు

LBNagar Police Break And Catch Illegal Transportation Of Kids

* మానవ అక్రమ రవాణాదారుల నుంచి హైదరాబాద్‌ పోలీసులు 11 మంది చిన్నారులను కాపాడారు. ఎల్బీనగర్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో ఓ బస్సులో కొందరు చిన్నారులు అనుమానాస్పదంగా కనపడడంతో ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వారిని రక్షించారు.’ఎల్బీనగర్‌ ఎక్స్ రోడ్‌ వద్ద ఓ బస్సులో చిన్నారులు ఉన్న విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో వారిని వెంటనే కాపాడి సైదాబాద్‌లోని చిన్నారుల శిబిరానికి పంపారు. ఆ చిన్నారులను ఛత్తీస్‌గఢ్ నుంచి కొందరు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వారితో కూలీ పనులు చేయించాలనుకున్నారు’ అని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.

* ట్యాబ్‌ కోసం అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదం పన్నెండేళ్ల బాలుడి ప్రాణం తీసింది. ఆవేశంలో భవనంపై నుంచి దూకి ఆ చిన్నారి మరణించిన విషాదఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. మియాపూర్‌ పోలీసులు, బాలుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నకిరేకల్‌కు చెందిన శ్రీనివాసనాయుడు, మల్లేశ్వరి దంపతులు ఉద్యోగరీత్యా నగరానికి వచ్చి హైదరాబాద్‌ మియాపూర్‌లోని మంజీరా పైప్‌లైన్‌ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌస్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రెండో కుమారుడు బాలవెంకట సత్యప్రసాద్‌(12) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం సెలవు కావడంతో ఇంట్లో తన అన్న ట్యాబ్‌తో ఆడుకోవడం చూసి తనకూ కావాలంటూ అన్నతో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో విధులకు వెళ్తున్న తండ్రితో తనకు ట్యాబ్‌ ఇప్పించాలని కోరాడు. దీంతో ట్యాబ్‌ ఇవ్వాల్సిందిగా పెద్దకుమారుడికి చెప్పి తండ్రి ఇంట్లోంచి బయలుదేరాడు. ఆయన కింది అంతస్తుకు చేరేలోపే చిన్న కుమారుడు పైఅంతస్తు నుంచి నాన్నా వెళ్లొద్దంటూనే కిందకు దూకేశాడు. క్షతగాత్రుడిని కుటుంబీకులు మదీనగూడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

* గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. టవేరా వాహనం వాగులోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కాకుమాను గ్రామానికి చెందిన బంధువులంతా గుంటూరు రూరల్‌ మండం ఏటుకూరులో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను శ్రీను(50), వీరలక్ష్మి(48), ప్రసాదం(55), సీతమ్మ(65), రమణ(48), సుబ్బులుగా గుర్తించారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.