* ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. ఇల్లెందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లకు జరిమానా విధించాలని ఆదేశించారు. స్వాగతపు ఫ్లెక్సీలను పెట్టినందుకుగానూ ఆయన్నుంచి రూ.1లక్ష వసూలు చేయాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఫ్లెక్సీలతో చేసే ఆర్భాటాల ద్వారా నాయకులు కాలేరని, ప్రజలకు సేవ చేస్తూ వారి గుండెల్లో ఉండేవారే నిజమైన నాయకులని చెప్పారు.
* నాబార్డ్ నుంచి వచ్చిన నిధులను తెరాస ప్రభుత్వం దారి మళ్లించిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం పేదల కోసం ఇచ్చిన నిధులు ప్రైవేట్ కాంట్రాక్టులకు మళ్లించారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్‌లోపు పేదలకు న్యాయం జరగకపోతే ప్రజా పోరాటానికి దిగుతామని ఆయన అన్నారు. రెండు పడకగదుల ఇళ్ల సాధన కోసం కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
* పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దేశంలోని శరణార్థులందిరికీ పౌరసత్వం కల్పిస్తామని, అంత వరకు మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని హోంమంత్రి అమిత్‌షా అన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన సీఏఏ అనుకూల బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2021లో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పేదరికాన్ని పారదోలుతామన్నారు.
* ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేవలం దురుద్దేశంతోనే మూడు రాజధానుల ప్రకటన చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అమరావతి రైతులకు సంఘీభావంగా కన్నా ఆధ్వర్యంలో భాజపా నేతలు గుంటూరు కన్నావారితోట నుంచి తుళ్లూరుకు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం కన్నా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై గొంతెత్తిన వారిపై తప్పుడు కేసులుపెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అనే మాటకు భాజపా కట్టుబడి ఉందని కన్నా స్పష్టం చేశారు.
* వైకాపా సింహగర్జన సదస్సులో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామన్నారు. ప్రభుత్వం తీర్మానం చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
* గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. టవేరా వాహనం వాగులోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కాకుమాను గ్రామానికి చెందిన బంధువులంతా గుంటూరు రూరల్ మండం ఏటుకూరులో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
* న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనపై పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఇతరులపై నిందలు వేసే ఆట ఆడమని, రెండో రోజు ప్రదర్శనలో ఎవరినీ ప్రత్యేకంగా నిందించమని అన్నాడు. ‘‘ఇతర ఆటగాళ్లపై నిందలు వేసే ఆటను మేం ఎప్పటికీ ఆడం. ఈ రోజు ప్రదర్శనలో ఎవరినీ నిందించట్లేదు. బౌలింగ్ విభాగం విఫలమైన సందర్భాల్లో బ్యాట్స్‌మెన్ ఎప్పుడైనా బౌలర్ల వైఫల్యం గురించి మాట్లాడారా? ప్రతికూల పరిస్థితుల్లో జట్టుగా మేం మంచి ప్రదర్శన చేయడానికే చూస్తాం.’’ అని తెలిపాడు.
* ఇరాన్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఆ దేశంలో కరోనా కారణంగా మరో 11 మంది మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఆరోగ్య శాఖ ప్రతినిధి కియనోశ్ జహన్‌పౌర్ మాట్లాడుతూ.. దేశంలోని మషద్ సహా చాలా నగరాల్లో కొత్త కరోనా కేసులు నిర్దారణ అయ్యాయన్నారు. తాజాగా మరణించిన 11 మందితో కలిపి మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 54కు చేరినట్లు తెలిపారు.
* వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి లక్ష కోట్లు దాటాయి. ఫిబ్రవరి నెలకు గానూ రూ.1.05 లక్షల కోట్లు వసూలయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 8 శాతం పెరగ్గా.. గత నెలతో పోలిస్తే వసూళ్లు తగ్గడం గమనార్హం. జనవరి నెలలో రూ.1.10 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఫిబ్రవరి నెలకు గానూ జీఎస్టీ కింద మొత్తం రూ.1,05,366 కోట్లు వసూలయ్యాయి.
* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ విక్రయాలు ఫిబ్రవరి నెలలో కూడా తగ్గాయి. గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే దేశీయ విక్రయాలు తగ్గి 1,34,150కు చేరాయి. గత సీజన్‌లో 1,39,100 కార్లను విక్రయించింది. మరోపక్క ఎగుమతులు మాత్రం 7.1శాతం పెరిగాయి. గతేడాది 9,582 కార్లను విక్రయించగా.. ఈ సారి 10,261 కార్లను అమ్మింది. అదే సమయంలో 2,699 గ్లాన్జా కార్లను కూడా ఎగుమతి చేసింది. మొత్తం విక్రయాలు స్వల్పంగా తగ్గాయి.