Food

మలబద్ధకంపై దెబ్బ కొట్టే పుదీనా

మలబద్ధకంపై దెబ్బ కొట్టే పుదీనా

చట్నీ, రైతా, బిర్యానీ… ఇలా ప్రతి వంటకంలో పుదీనా వాడుతాం. వంటలకు ఘాటుదనాన్ని, ఒంటికి చల్లదనాన్ని అందించే పుదీనాలో ఔషధ గుణాలు చాలానే ఉన్నాయి. నాలుగు పుదీనా ఆకులు నోట్లో వేసుకుంటే చాలు నోటి దుర్వాసన మాయమవుతుంది. మరిన్ని లాభాలేమంటే…దీనిలోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఒంట్లోని విషదార్థాలను బయటకు పంపిస్తాయి. వాంతులు, వికారం, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయి. పుదీనా ఆకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తాయి. వేసవిలో పుదీనా ఆకులతో షర్బత్‌ చేసుకొని తాగితే చలువ చేస్తుంది.తలనొప్పిగా అనిపించినప్పుడు నుదురు మీద పుదీనా నూనె రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకులు నమిలితే నోటి దుర్వాసన పోయి తాజా శ్వాస సొంతమవుతుంది. నోటిలోపల బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవడంతో పాటు దంతాల మధ్య ఉన్న పాచి వదులుతుంది. జీర్ణాశయ ఎంజైమ్‌లను ఉత్తేజితం చేయడం ద్వారా ఆహారం సంపూర్ణంగా జీర్ణం అవుతుంది. దాంతో జీవక్రియలు సాఫీగా జరుగుతాయి. పుదీనా ఫేస్‌ప్యాక్‌గానూ పనికొస్తుంది. నల్లమచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. పుదీనా రసంతో రుద్దుకుంటే ముఖం మీది మలినాలు తొలగి తాజాగా కనిపిస్తుంది.