ఉపనిషత్తులెన్ని? పది… ఠక్కున వచ్చే సమాధానమిది. వేదసారాలైన పది ఉపనిషత్తులకు జగద్గురు ఆది శంకరాచార్య భాష్యం రాయడంతో అవి ప్రామాణికాలుగా మిగిలాయి. నిజానికి 1180 ఉపనిషత్తులున్నట్లు పండితులు చెబుతారు. అందులో 108 ముఖ్యమైనవిగా భావిస్తారు. వాటిలో ఆసక్తికరమైనవి, ఆశ్చర్యాన్ని కలిగించేవి మనకు కనిపిస్తాయి.*మైత్రాయణి ఉపనిషత్తు ఆత్మ దేహంలో ఎలా ప్రవేశిస్తుంది? జీవాత్మ పరమాత్మగా ఎలా మారుతుంది? మోక్షాన్ని సాధించడం ఎలా? అనే ప్రశ్నలు, వాటికి సమాధానాలు మైత్రాయణి ఉపనిషత్తులో కనిపిస్తాయి. ఇందులోని ఖిల కాండంలో ప్రపంచ ఉత్పత్తికి సంబంధించిన అంశాలుంటాయి. సత్త్వరజస్తమో గుణాలు, బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు కూడా ఉన్నాయనే నిరూపణ ఇందులో ఆసక్తికరమైన అంశం.
*గర్భోపనిషత్తు
వేదాల్లో అన్ని శాస్త్రాలు ఉన్నాయని అంటుంటారు. దానికి గర్భోపనిషత్తు ఒక ఉదాహరణ. తల్లి గర్భంలో బుడగ రూపంలో ఉన్న పిండం నాడులు, ఎముకలు, అంగాలు, వెంట్రుకలు, గోళ్లు, గుండె… ఇలా ఏ సమయంలో ఏం ఏర్పడతాయో వివరంగా కనిపిస్తాయి. గర్భంలో శిశువు పెరిగి పెద్దయ్యేటప్పుడు వారి ప్రవృత్తులు తల్లిదండ్రుల మానసిక స్థితిని బట్టి ఉంటాయని అందులో ఉంది.
*అమృత బిందోపనిషత్తు
కృష్ణ యజుర్వేదంలో భాగంగా అమృత బిందోపనిషత్తు కనిపిస్తుంది. వస్తువులపై ఆశ కలుగుతున్నప్పుడు మనసును ఎలా నియంత్రించాలి… పరమానందాన్ని ఎలా పొందాలి? అనే విషయాలు ఇందులో చర్చించారు. ఆత్మ నిజ స్వరూపంపై చర్చ ఆసక్తిగొలుపుతుంది.
*సూర్యోపనిషత్తు
చతుర్విధ పురుషార్థ సిద్ధి కోసం సూర్యభగవానుడిని ప్రార్థించమని ఈ ఉపనిషత్తు బోధిస్తుంది. ఇందులో సూర్యవర్ణన, సూర్యమండలానికి సంబంధించిన అనేక అంశాలు కనిపిస్తాయి. ప్రత్యక్షదైవమైన సూర్యభగవానుడే పరబ్రహ్మ స్వరూపమని ఇది వివరిస్తుంది. ఈ ఉపనిషత్తును చదవడం వల్ల కలిగే మేలుని ఫలశ్రుతిగా కూడా చూడొచ్చు.
*పరమహంస పరివ్రాజకోపనిషత్తు
ఒకసారి బ్రహ్మదేవుడికి సందేహం వచ్చింది. పరివ్రాజకుడు ఎవరు? పరమహంస లక్షణాలేంటి? అని ఆదినారాయణుడిని అడిగాడు. అప్పుడాయన చెప్పిన సమాధానం ఉపనిషత్తుగా మారింది. సన్యాసాన్ని గురించిన సమస్త వివరాలు పరమహంస పరివ్రాజకోపనిషత్తులో ఉన్నాయి. భార్యేషణ, పుత్రేషణ, ధనేషణ అనే ఈషణత్రయాలు ఉండకూడదని ఉంది. బ్రహ్మచర్యం ప్రాధాన్యాన్ని ఇక్కడ చూడొచ్చు.
*శరభోపనిషత్తు
అధర్వణ వేదంలోని శరభోపనిషత్తును బ్రహ్మదేవుడు గాలవ్యుడికి చెప్పినట్లు కనిపిస్తుంది. త్రిమూర్తుల్లో ఎవరు అధికులో వివరించమని గాలవ్యుడు అడిగాడు. అప్పుడు బ్రహ్మ హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం ఉగ్రరూపుడైన నృసింహస్వామిని పరమేశ్వరుడు శరభ మృగం అవతారంలో శాంతింపజేశాడు… ఇలా ఎన్నో శాంతి కార్యాలతో ప్రపంచాన్ని చల్లగా ఉండేలా చేస్తున్న పరమేశ్వరుడే గొప్పవాడని బ్రహ్మ వివరించడం ఈ ఉపనిషత్తులోని విశేషం.
పరివ్రాజకుడు ఎవరు? పరమహంస లక్షణాలేంటి?
Related tags :