Fashion

చర్మసౌందర్యానికి విటమిన్-సీ ముఖ్యం

Telugu Fashion News-Skin Protection Tips Summer

ఎండల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం తాజాదనాన్ని కోల్పోతుంది. ఎక్కువగా నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల కొంతమేర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ పండ్లు ముఖానికి మాస్క్‌లుగా కూడా ఉపయోగపడతాయి. చర్మ సౌందర్యం కోసం ఖరీదైన లోషన్లు, క్రీములను ఎక్కువగా వాడటం వల్ల, అందులోని రసాయనాలతో చర్మం దుష్ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇంట్లోనే తాజాపండ్లతో ఫేషియల్స్ చేసుకుంటూ, కొద్దిపాటి చిట్కాలను పాటిస్తే చర్మ సంరక్షణ సులభంగానే సాధ్యపడుతుంది.బ్యూటీపార్లర్‌లకు వెళ్లకుండానే ఇంట్లోనే పండ్లతో చర్మాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. దీనివల్ల చర్మానికి, శరీరానికి ఎటువంటి హానీ జరగదు. సీజన్‌ను అనుసరించి లభించే తాజాపండ్లలో విలువైన పోషకాలున్నందున పండ్ల గుజ్జును ముఖానికి, శరీరంలోని ఇతర భాగాలకు రాసుకుంటే చర్మం మిలమిలా మెరిసిపోతుంది. అరటి, ఆరెంజ్, యాపిల్, మామిడి, స్ట్రాబెర్రీ.. ఇలా అనేక రకాల పండ్లు చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడతాయి.
*అరటిపండు:
సంవత్సరమంతా లభించే పండు అరటిపండు. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి చర్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అరటిపండులో ఎ, బి, ఈ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీనితో చర్మం మంచి రంగులోకి మారి, నిగారింపుగా ఉంటుంది.
*నిమ్మ:
నిమ్మలో ఉండే విటమిన్ సి చర్మం అందంగా మారడానికి ఉపయోగపడుతుంది. ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాసు వేడినీళ్లలో నిమ్మ, తేనె కలిపి తాగితే చర్మం నిగనిగలాడుతుంది. చర్మం లోపలి కణాల్లోని నల్లటి మచ్చలపై, నల్లగా ఉన్న ప్రాంతాల్లో నిమ్మతో రుద్దితే చర్మం అందంగా తయారవుతుంది.
*ఆపిల్:
రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ అవసరమే ఉండదు అనే నానుడి అందరికీ తెల్సిన విషయమే. ఆపిల్ పండు ముఖానికి రాసుకోవడం వల్ల బ్యూటీషియన్ అవసరం కూడా ఉండదు అనేది నేటి నానుడి. సాధారణ చర్మం కలవారికి ఆపిల్‌తో చేసిన ఫేస్‌ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి ఆపిల్ గుజ్జును తయారుచేసుకోవాలి. ఇందులో కాస్త తేనె, రోజ్‌వాటర్‌ను కలుపుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా కొద్దిరోజులపాటు చేస్తుంటే చర్మంపై ఉన్న నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగారింపు రెట్టింపు అవుతుంది. అంతేకాదు చర్మం పొడిబారడం, పగుళ్లు వంటి సమస్యలు ఉండవు.
*బొప్పాయి:
పూర్వీకుల నుండి బొ ప్పాయి పండును చర్మ సౌందర్యానికి వినియోగిస్తూనే ఉన్నారు. ఈ పండు రసాన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌గా వేసుకోవచ్చు. ముఖంపై ఏర్పడిన మచ్చలకు, మొటిమలకే కాక, వివిధ చర్మ వ్యాధులను తగ్గించేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది. చర్మంలో ఉన్న మృతకణాలను, మృత చర్మాన్ని పోగొడుతుంది. చర్మం మరింత ప్రకాశించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. *స్ట్రాబెర్రీ:
స్ట్రాబెర్రీ గుజ్జు ముఖంపై మృతకణాలను తొలగిస్తుంది. ఈ గుజ్జులో కొద్దిగా పాలు, తేనె కలిపి ముఖానికి పూసి, పదిహేను నిముషాలు అలాగే ఉంచుకోవాలి. ఆరిన తరువాత ముఖాన్ని కాస్త తడిచేసి రుద్దుతూ ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై మలినాలు తొలగిపోయి ముఖం తేటగా, అందంగా మారుతుంది.