కొందరు పిల్లలు తాము పట్టిన పట్టు ఓ పట్టాన వదలరు. ఇలాంటి వారికి నచ్చచెప్పడం తల్లిదండ్రులకి కత్తిమీద సామే. మరి వారిని దారిలోకి తేవడం ఎలా అంటారా…
వినండి… వాదించకండి: మొండిగా ఉండే పిల్లలు దారిలోకి రావాలంటే ముందు వారి వాదన వినడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఏదైనా విషయంపై మీ చిన్నారి అదే పనిగా వాదిస్తుంటే…మీరు వెంటనే ఖండించొద్దు. ఎందుకంటే దానిపై కచ్చితంగా తనకో బలమైన అభిప్రాయం ఉండి ఉండొచ్చు. ముందు అదేంటో తెలుసుకోండి. ఆ తరువాతే మీ అభిప్రాయం చెప్పడమో, వారితో ఏకీభవించడమో చేయొచ్చు.
బలవంతంగా వద్దు: పిల్లలతో ఏ పనినైనా బలవంతంగా మాన్పించాలన్నా, చేయించాలనుకున్నా వ్యతిరేకిస్తే మరింత మొండిగా తయారవుతారు. ఎదురుదాడి చేస్తారు. అలాకాకుండా ఉండాలంటే ముందు వారితో మమేకమవ్వండి. పని విషయంలో వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోండి. మీరు కోరుకున్న మార్పు వచ్చేవరకూ వారికి తోడుగా ఉండండి. కావల్సిన సలహాలు, సూచనలు ఇవ్వండి.
ప్రత్యామ్నాయాలు ఉండాలి: వయసులో చిన్నవాళ్లైనా పిల్లలకి కూడా సొంత ఆలోచనలు ఉంటాయి. ప్రతి పనీ ఇలా చేయి అలా చేయి అని చెప్పడం వల్ల ఆ అంశాలపై అయిష్టత పెంచుకుంటారు. ఆ పనులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. లేదా వాళ్లకి నచ్చినట్లు చేసేస్తారు. ఈ అలవాటుని మాన్పించాలంటే ప్రతి పనికీ కొన్ని ప్రత్యామ్నాయాలు చూపించండి. అప్పుడు దానిలో ఒకటి ఎంచుకోగలుగుతారు. మీ మాటా వింటారు.