*కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శనాస్త్రాలు సంధించారు. భారత్ మతాకి జై అన్న నినాదాన్ని కూడా ఆయన తప్పుబడుతునారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ వ్యాఖ్యలు రాజధానిలో నిర్వహించిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో వందేమాతరాన్ని పడితే నేరమగా భావించేవారు ఇప్పుడు భారత్ మతాకి జై నినాదాన్ని తప్పుబడుతున్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఏళ్ల తరువాత కూడా ఈ నినాదాన్ని నేరంగా పరిగణించడం బాధాకరమని ప్రధాని అన్నారు.
*కట్టప్పలే టీఆర్‌ఎస్‌ను కూల్చుతారు: లక్ష్మణ్
టీఆర్ఎస్‌లో ఉన్న కట్టప్పలే ఆ పార్టీని కూల్చుతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. పీఆర్సీ కోసం ఇందిరాపార్క్ దగ్గర రిటైర్డ్ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్‌లో ఎంతమంది కట్టప్పలు ఉన్నారో చూసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ కట్టప్పలే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని జోస్యం చెప్పారు. బ్రహ్మాస్త్రం మోదీని ప్రయోగిస్తామని, తెలంగాణ ప్రభుత్వ పునాదులు పెకిలిస్తామని హెచ్చరించారు.
*ఏపీలో వైఎస్సార్ జగనన్న కాలనీలు
వెలగపూడిలోని సచివాయలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. అనంతరం సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ…కేబినెట్ భేటీ వివరాలను వెల్లడించారు. ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.‘‘స్థలం పొందిన లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి పత్రంతో పాటు, ఐదేళ్ల వరకు స్థలం బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి.. ఐదేళ్ల తర్వాత విక్రయానికి హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వబోతున్నాం. ఇందుకోసం అందరు తహశీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్టార్లుగా హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు 43,141 ఎకరాల భూమిని సిద్దం చేశాం. ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ప్రైవేటు భూమి ఉంది. యుద్ధ ప్రాతిపదికన ప్లాట్లు అభివృద్ధి చేసి లబ్ధిదారులకు ఇవ్వబోతున్నాం. ఈ కాలనీలన్నింటికీ వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేస్తాం’’ అని మంత్రి పేర్ని నాని వివరించారు.
* తేడా వస్తే మంత్రి పదవులు ఊడతాయ్:జగన్
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం జగన్ మంత్రులను ఆదేశించారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రులతో సీఎం కొద్దిసేపు సమావేశమయ్యారు. ఆ భేటీలో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం.. సన్నద్ధతపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికల్లో గెలుపు బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. మద్యం, డబ్బు పంపిణీ చేస్తే జైలుకు వెళ్లక తప్పదని.. ఈ విషయంలో అధికార పార్టీ నేతలనూ ఉపేక్షించబోమని సీఎం హెచ్చరించారు.మంత్రులు సొంత నియోజకవర్గాల్లో ఓడితే 5 నిమిషాలు కూడా ఆలోచించనని.. తేడా వస్తే మంత్రి పదవులు ఊడతాయని జగన్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక ఎన్నికల్లో పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు వచ్చేసారి టికెట్లు ఉండవని జగన్ స్పష్టం చేశారు. రేపటి నుంచి ఈనెల 8వ తేదీ వరకు కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలని.. ఎన్నికల కోడ్ వచ్చాక పూర్తి సన్నద్ధతతో రంగంలోని దిగాలని సీఎం దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల తర్వాతే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని మంత్రులకు జగన్ సంకేతాలు ఇచ్చాయి.
*మాజీ ఎమ్మెల్యేపై ఐటీ దాడులు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారానికి సంబంధించి హర్యానాలోని ఫరీదాబాద్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ నాగర్ నివాసంపై బుధవారం ఆదాయ పన్ను అధికారులు దాడులు చేపట్టారు. ఎమ్మెల్యే లలిత్ నాగర్ నివాసం సహా ఆయన సోదరుల నివాసాలతో పాటు దాదాపు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ దాడులు జరిగాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరీ ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలో కాంగ్రెస్ హయాంలో రాబర్ట్ వాద్రాకు కారు చౌకగా భూములు కట్టబెట్టారనే వ్యవహారంలో భాగంగా ఈ దాడులు సాగాయి. ఫతేపూర్ మాజీ సర్పంచ్ నివాసంపైనా ఐటీ దాడులు జరిగాయి. కాగా తనను వేధించేందుకే తన నివాసంపై ఐటీ అధికారుల దాడులు జరిగాయని నాగర్ ఆరోపించారు.
*లోకేశ్ పర్యటన అడ్డుకునేందుకు వైకాపా యత్నం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ప్రజా చైతన్యయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించాయి. మునికూడలి వద్దకు కాన్వాయ్ రాగానే ‘లోకేశ్ గో బ్యాక్’ అంటూ వైకాపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ర్యాలీలో అత్యధికంగా పాల్గొన్న తెదేపా వర్గీయులు వైకాపా శ్రేణులను ప్రతిఘటించారు. ర్యాలీ పూర్తి చేసి వెళ్లిపోతున్న సమయంలో వైకాపా అడ్డంకులు సృష్టించడం తగదని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
*బీసీలపై కక్షతోనే ఇలా చేశారు: చంద్రబాబు
సీఎం జగన్ అసమర్థత వల్లే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. 33ఏళ్ల పాటు ఉన్న రిజర్వేషన్లను కాపాడలేకపోయారని.. బీసీలపై కక్షతోనే ఇలా చేశారని ఆయన ఆక్షేపించారు. వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాల్సిన అవసరముందని చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. క్షేత్రస్థాయి నుంచే సమర్థమైన నేతలు రావాలనే ఉద్దేశంతో 1987 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్ కల్పించామని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్ల పెంపుతో అనేక బీసీ కులాలు రాజకీయంగా పైకి ఎదిగాయని చెప్పారు.
*మధ్యప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం!
మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నిస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలతో రాష్ట్రంలో రాత్రికి రాత్రి రాజకీయం వేడెక్కింది. తమ ప్రభుత్వంలోని మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలను భాజపా నేతలు బలవంతంగా హరియాణాలోని ఓ హోటల్‌లో ఉంచారని ఆ రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రి జితూ పట్వారీ ఆరోపించారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రులు నరోత్తం మిశ్రా, భూపేంద్ర సింగ్, రామ్‌పాల్ సింగ్ సహా మరికొంత మంది సీనియర్ భాజపా నాయకులు బలవంతంగా అధికార కూటమికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్ని హరియాణాలోని ఓ హోటల్‌కు తరలించారు. కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారని సదరు ఎమ్మెల్యేలే మాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వారందర్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే నలుగురు తిరిగొచ్చారు’’ అని పట్వారీ అన్నారు.
*ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరైన ఎంపీ రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి మంగళవారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన.. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం కోర్టుకు వచ్చారు. కాగా ఈ కేసును కోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. రేవంత్రెడ్డి కోర్టుకు హాజరైన నేపథ్యంలో న్యాయస్థానం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
*అధీర్ రంజన్ చౌధురి కార్యాలయంపై దాడి
లోక్సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. మంగళవారం సాయంత్రం దిల్లీలోని అధీర్ రంజన్ కార్యాలయం వద్దకు నలుగురు యువకులు వచ్చారు. ఎంపీతో ఫోన్లో మాట్లాడాలని పట్టుబట్టారు. సిబ్బంది నిరాకరించడంతో కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
*ఉపాధి పనుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వ పక్షపాతవైఖరి-కేంద్ర మంత్రికి భాజపా ఎంపీల ఫిర్యాదు
కేంద్ర ప్రభుత్వ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం భాజపా ఎంపీల నియోజకవర్గాలపట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్కు ఫిర్యాదు చేశారు. మంగళవారం పార్లమెంటు ఆవరణలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులు మంత్రికి పరిస్థితిని వివరించారు. ‘‘ఉపాధి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం తమ నియోజకవర్గాల పరిధిలో సిమెంట్, కాంక్రీట్ రోడ్లు కేటాయించడంలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోంది. అధికారులపై ఒత్తిడితెస్తూ పనులను అడ్డుకుంటున్నారు. భాజపా జడ్పీటీసీలు, ఎంపీటీసీల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని’’ వారు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
*తాజాగా దరఖాస్తు చేసుకోండి-భద్రతపై రేవంత్రెడ్డికి హైకోర్టు సూచన
వ్యక్తిగత భద్రతకు సంబంధించి కేంద్ర హోంశాఖకు తాజాగా రెండు వారాల్లో దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డికి హైకోర్టు సూచించింది. దానిని పరిశీలించి 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీచేసింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకోవచ్చని తెలిపి పిటిషన్పై విచారణను మూసివేసింది. తన భద్రతకు సంబంధించి గత ఏడాది ఆగస్టు 28న కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై తగిన నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం జస్టిస్ అభినంద్కుమార్ షావిలి విచారణ చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 4 + 4 భద్రతను, రాష్ట్ర ప్రభుత్వం 2 + 2కు తగ్గించిందని, దీనిపై కేంద్రానికి లేఖ రాసినా స్పందనలేదని పిటిషన్లో రేవంత్ పేర్కొన్నారు.
*అమిత్షా సభకు జన సమీకరణపై ప్రత్యేక దృష్టి-ఎల్బీ స్టేడియాన్ని పరిశీలించిన కమలనాథులు
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ఈ నెల 15న నిర్వహించే బహిరంగ సభను కమలదళం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా హాజరవుతున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు భాజపా వ్యూహరచన చేస్తోంది. సభకు అన్ని జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా చూడాలని నిర్ణయించిన కమలదళం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 29 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జనసమీకరణకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ఇన్ఛార్జిలుగా పెట్టాలని నిర్ణయించింది. యువకులు ద్విచక్ర వాహనాలపై, మహిళలు, వృద్ధులు బస్సుల్లో వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సభ నిర్వహించే హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో పాటు పలువురు నేతలు మంగళవారం పరిశీలించారు.
*కాంగ్రెస్ బతికుంటేనే మనకు బతుకు: భట్టి
దళితులు, గిరిజనులను మోసం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ సమానమే అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన ప్రీతమ్ మంగళవారం గాంధీభవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడారు. ‘‘6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనతోనే రిజర్వేషన్లు పొంది చైతన్యవంతులం అయ్యాం. 6 ఏళ్ల భాజపా పాలనలో దేశంలో లక్షలాది మంది భయంతో బతికే పరిస్థితి ఏర్పడింది. ఎన్ఆర్సీ, సీఏఏలతో అనేక మంది భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటేనే మనం (కార్యకర్తలు) బతికుంటాము. పార్టీ పోరాటాల్లో భాగస్వామ్యం అవుదాం’’ అని శ్రేణులకు పిలుపునిచ్చారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆందోళనకరమైన విషయమన్నారు.
మన్మోహన్ పై మోడీ విసుర్లు-రాజకీయ
Related tags :