Business

జెట్ ఎయిర్‌వేస్ గోయల్‌పై ఈడీ కేసులు

ED Files Case On Jet Airways Founder Naresh Goyel

జెట్ ఎయిర్‌వేస్ మాజీ ఛైర్మన్ నరేష్‌ గోయల్‌తో పాటు ఆయన భార్య అనితపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్‌ఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. గతంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలు ఉల్లఘించినందుకు ఫెమా కింద ఈడీ అధికారులు గోయల్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా ముంబయిలోని ఓ ట్రావెల్ సంస్థను గోయల్, ఆయన భార్య రూ.46 కోట్లకు మోసం చేసినట్లు ఫిర్యాదు అందడంతో ముంబయి పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా గోయల్ నివాసంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన అధికారులు గోయల్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతేడాది ఆగస్టులో విదేశీ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ముంబయి, దిల్లీలోని గోయల్‌కు చెందిన 12 ప్రాంగణాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో గతేడాది ఏప్రిల్ 17న జెట్ ఎయిర్‌వేస్‌ సర్వీసులు నిలిపి వేసింది. అంతకముందు మార్చిలో గోయల్ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్‌ నుంచి భారీగా నిధులను మళ్లించినట్లు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ తన నివేదికలో పేర్కొంది.