దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో పటియాలా హౌస్ కోర్టు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేసింది. నలుగురు దోషులకు మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలని తీహాడ్ జైలు అధికారులను ఆదేశించింది. నిందితులకు న్యాయపరంగా ఉన్న అవకాశాలు మూసుకుపోయాయని, తాజా డెత్ వారెంట్లు జారీ చేయాలని దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా తాజా డెత్ వారెంట్లు జారీ చేశారు. నిందితుల తరఫు న్యాయవాది కూడా డెత్ వారెంట్ల జారీకి ఎలాంటి అవరోధాలూ లేవని పేర్కొన్నారు.మరణశిక్ష అమలు వాయిదా వేసేందుకు నిర్భయ దోషులు అక్షయ్ ఠాకూర్ (31), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), ముకేశ్‌సింగ్ (32) శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. న్యాయపరమైన అవకాశాల పేరిట వారు పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరి అమలు తేదీ మూడుసార్లు వాయిదా పడింది. తొలిసారి ఈ ఏడాది జనవరి 22న, ఫిబ్రవరి 1న రెండోసారి డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ ఉరి వాయిదా పడింది. మార్చి 3న మరోసారి ఉరితీయాలని డెత్‌వారెంట్లు జారీ అయినప్పటికీ దోషుల్లో ఎలాంటి న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోని పవన్ గుప్తా రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడంతో మరోసారి ఉరి అమలు వాయిదా పడింది. అతడి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురవ్వడంతో దిల్లీ ప్రభుత్వం డెత్‌వారెంట్ల జారీపై పిటిషన్ వేసింది. దోషులకు ఉన్న అన్ని మార్గాలూ మూసుకుపోవడంతో మార్చి 20న ఉరి తీయడం ఖాయం.
హమ్మయ్యా…ఇక వీరి ఉరిని ఎవరూ ఆపలేరు!
Related tags :