Politics

ఏపీ రాజ్యసభ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

AP Rajyasabha Election 2020 Notification Released

ఆంధ్రప్రదేశ్‌ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 13వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల దాఖలకు తుది గడువుగా నిర్ణయించారు. నామినేషన్‌ పత్రాలను నేటి నుంచి జారీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అమరావతిలోని శాసనసభ కార్యదర్శి లేదా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఈ నామినేషన్‌ పత్రాలు పొందవచ్చునని తెలిపారు. మార్చి 16వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 18వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు తుది గడువుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలింగ్ నిర్వహించనున్నారు. ఏపీ శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్‌లో ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. కాగా, మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందనున్నారు. దీంతో ఆ స్థానాలను భర్తీ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దానిలో భాగంగా ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మహ్మద్ అలీఖాన్, టి సుబ్బరామిరెడ్డి, తోట సీతారామ లక్ష్మి, కె. కేశవరావులు పదవీ విరమణ పొందనున్నారు.