* ఉభయ సభలనుద్దేశించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగం వాస్తవాలకు దరిదాపుల్లో కూడా లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు. నిరుద్యోగ భృతి, సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టత లేదని పేర్కొన్నారు. రెండు పడకల ఇళ్లపై ఆరేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మాట చెబతోందని భట్టి మండిపడ్డారు. పోడు భూములు, ఎస్సీ, ఎస్టీ నిధులపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన రాలేదన్నారు. రుణమాఫీ, రైతుబంధు పథకాలు కేవలం ఎన్నికల ఆయుధాలుగా మారాయని వ్యాఖ్యానించారు.
* వైవిధ్యమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ యువ కథానాయకులకు దీటుగా ముందుకు సాగుతున్న మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. ఆయన కథానాయకుడిగా ప్రియదర్శన్ దర్శకత్వంతో తెరకెక్కిన హిస్టారికల్ చిత్రం ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’. ప్రియదర్శన్ ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
* స్థానిక ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రేపు వెనువెంటనే విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా విజయవాడలోని ఈసీ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైకాపా నుంచి ఎమ్మెల్యేలు జోగి రమేశ్, అనిల్ కుమార్, తెదేపా నుంచి వర్ల రామయ్య, ఆలపాటి రాజాతో పాటు పోతిన వెంకట మహేశ్ (జనసేన), వైవీ రావు (సీపీఎం), జెల్లి విల్సన్ (సీపీఐ) నాగభూషణం (భాజపా) హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల నేతలు తమ అభిప్రాయాలను ఎస్‌ఈసీకి తెలిపారు..
* ఏపీ భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడితే మంచిదని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని ఉద్యమంపై రాసిన ‘అమరావతి ఆక్రందన’, ‘స్టాప్ అన్‌డూయింగ్ ఆఫ్ అమరావతి’ పుస్తకాలను సుజనాచౌదరి దిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజధాని ఉద్యమంలో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని చెప్పారు. వైకాపా నేతలు అమరావతిలో ఒకమాట.. దిల్లీలో మరోమాట చెబుతున్నారని ఆరోపించారు.
* స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా 24 శాతానికి తగ్గించి వెనుకబడిన కులాలకు జగన్ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ చర్యను బీసీలు, బీసీ సంఘాలు వ్యతిరేకించాలన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీసీ వర్గాలకు చెందిన 15 వేల మందికి రాజకీయ అవకాశాలు రాకుండా వారి అభ్యున్నతిని సీఎం జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని యనమల దుయ్యబట్టారు.
* ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హౌజింగ్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
* రైతుబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదలకు వ్యవసాయశాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. పంట పెట్టుబడి కోసం ఉద్దేశించిన రైతుబంధు పథకానికి ఈ ఏడాది ఇప్పటికే రూ.1350.61 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మరో రూ.333.29 కోట్లు మంజూరు చేయడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.1683.90 కోట్లు విడుదల చేసినట్లయింది.
* కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హర్షవర్ధన్ అభినందించారు. కరోనా వైరస్‌పై సమీక్షలో భాగంగా అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, యోగితా రాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నియంత్రణపై హర్షవర్ధన్ పలు సూచనలు చేశారు.
* స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ (జడ్పీ) పీఠాలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. 13 జిల్లాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపనుంది.
* యెస్ బ్యాంకుకు చెందిన ప్రతి ఖాతాదారుడి సొమ్ము సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్‌తో మాట్లాడానన్నారు. ఈ అంశంలో సత్వర పరిష్కారం కనుగొనే దిశగా ఆర్‌బీఐ కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఖాతాదారులు, బ్యాంక్, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొనే చర్యలు తీసుకుంటామన్నారు.
* తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20 వరకు జరగనున్నాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. ఈనెల 20వరకు సమావేశాలు కొనసాగించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 9, 10,15 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపు చర్చ, సమాధానం. ఈనెల 8న రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ చైనాకు వెలుపల 17రెట్ల వేగంతో వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అరికట్టాలని ప్రపంచదేశాలకు సూచించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3300మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 98వేల మంది దీని బారినపడ్డారు. కేవలం చైనాలోనే 3042మంది చనిపోగా తాజాగా మరో 30మరణాలు సంభవించాయి.
* ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 13వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల దాఖలకు తుది గడువుగా నిర్ణయించారు. నామినేషన్ పత్రాలను నేటి నుంచి జారీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అమరావతిలోని శాసనసభ కార్యదర్శి లేదా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఈ నామినేషన్ పత్రాలు పొందవచ్చని తెలిపారు.
* ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా(కొవిడ్-19).. భారత్‌లో కూడా విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా దిల్లీలో మరో కేసు నమోదుకావడంతో ఈ కేసుల సంఖ్య 31కి చేరింది. దిల్లీకి చెందిన ఓవ్యక్తి ఈమధ్యే థాయిలాండ్, మలేషియా దేశాల్లో పర్యటించి వచ్చాడు. తాజాగా అతడు అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయ్యిందని వైద్య అధికారులు వెల్లడించారు.
* గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం విఫలమైన అంశాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడంలో తన శాఖ తీవ్రంగా విఫలమైందని పేర్కొన్నారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2018 రోడ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉండడం విచారకరమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో జరుగుతున్న ప్రమాదాల్లో 11 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని తెలిపారు.
* ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్(కొవిడ్-19)కు మందు కనిపెట్టే పరిశోధనలో పురోగతి సాధించినట్లు జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. మనిషి ఊపిరితిత్తుల్లోకి ఈ వైరస్ ప్రవేశించడానికి సహాయపడుతున్న ప్రోటీన్‌ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు జర్మనీకి చెందిన ‘జర్మన్ ప్రైమేట్ సెంటర్’ సహా మరికొంత మంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఫలితాలను ‘జర్నల్ సెల్’లో ప్రచురించారు.
* దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం దిశగానే పయనిస్తున్నాయి. భల్లూకపు పట్టులో మరింత చిక్కుకుపోయాయి. ఒక వైపు కరోనా భయాలు మరోవైపు యెస్ బ్యాంకుపై ఆందోళనలు వెల్లువెత్తడంతో శుక్రవారం సూచీలన్నీ భారీ నష్టాలు చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 894 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడేలో ఒకానొక సమయంలో 1,459 పాయింట్లు పడిపోయిన సూచీ చివరికి 893.99 లేదా 2.32 శాతం నష్టంతో 37,576.62తో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 279.55 (2.48%) పాయింట్లు కోల్పోయి 10,989.45 వద్ద స్థిరపడింది.