* మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ నగలతో బ్యాంకు అప్రైజర్ ఖాతాదారులను బురిడీ కొట్టింది. బ్యాంక్‌లో కొత్త అకౌంట్లు ఓపెన్ చేసి. గోల్డ్ లోన్లను స్వాహా చేశారు. దాదాపు 500 మంది ఖాతాదారుల పేర్లతో రోల్డ్‌గోల్డ్ తాకట్టుపెట్టిన అప్రైజర్. లక్షల్లో బ్యాంక్‌కు టోపీపెట్టాడు. అనుమానం వచ్చిన మేనేజర్ నగలను తనిఖీ చేయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నగలు సరిచూసుకోవాలని మేనేజర్ విజ్ఞప్తి చేయడంతో, ఆందోళనతో ఖాతాదారులు బ్యాంకుకు క్యూ కట్టారు.
* బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (24 క్యారెట్లు) రూ.773 పెరిగి రూ.45,343కు చేరింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకు క్రితం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.44,570 వద్ద ముగిసినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ వెల్లడించింది. మరోవైపు కిలో వెండి ధర రూ.192 పెరిగి 48,180కి చేరింది.
* తాజాగా యెస్బ్యాంకులో చోటు చేసుకున్న పరిణామాల వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ అన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘యెస్బ్యాంకుతో ఆందోళన ఏముంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. మదుపర్ల డబ్బులన్నీ సురక్షితంగా ఉన్నాయి. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా అదే చెప్పారు. కాస్త ఓపికతో వ్యవహరించండి. అంతా మంచే జరుగుతుంది’’ అని అన్నారు.
* ప్రస్తుతం యెస్‌బ్యాంకు ఎదుర్కొంటున్న సంక్షోభానికి గత యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. 2014వరకు యూపీఏ ప్రభుత్వం తన సన్నిహితులకు కేవలం ఫోన్లలోనే రుణాలు మంజూరు చేసిందని ఆరోపించారు. యూపీఏ చేసిన పని ఫలితంగానే నేడు బ్యాంకులు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని దుయ్యబట్టారు. గతంలో వారు చేసిన తప్పులను సరిదిద్ది, బ్యాంకులను గాడిలో పెట్టేందుకే ప్రస్తుతం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వ విధానాల వల్ల కార్పొరేట్ కంపెనీలు యెస్‌బ్యాంకుకు రుణఎగవేత దారులుగా మారాయన్నారు. ఇప్పటికే యెస్‌బ్యాంకుకు ఆర్బీఐ 30రోజుల మారిటోరియం గడువు విధించిందని.. ఈలోపు ఖాతాదారులందరిని దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్థికమంత్రి వెల్లడించారు. ఖాతాదారులు, మదుపరులు దీనిపై భయపడాల్సిన అవసరం లేదని, వారి డబ్బు సురక్షితంగా ఉంటుందనే భరోసా ఇచ్చారు.