Movies

ఈ సినీప్రముఖుల పుట్టినరోజు నేడే

ఈ సినీప్రముఖుల పుట్టినరోజు నేడే

కృష్ణకుమారి అందమైన పాత తరం కథానాయిక. పుట్టి పెరిగింది పశ్చిమ బెంగాల్ అయినా తన సినీ రంగ ప్రవేశం మాత్రం తెలుగులోనే జరిగింది. వేదాంతం జగన్నాథ శర్మ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. మంచి సినిమాల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అక్క ని మించి తను గొప్ప పేరు తెచ్చుకున్నారు. సినిమా హాల్లో కృష్ణకుమారిని చూసిన ఆమె నవ్వితే నవరత్నాలు సినిమా కోసం అమాయకంగా కనిపించే కథానాయిక కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. తర్వాత రోజే వారు కృష్ణకుమారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆమెకు ఆ పాత్రనిచ్చారు. అలా తెలుగు సినిమా తెరకు 1951లో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయ్యారు. కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలైంది. తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. దేవాంతకుడు మొదలైన చిత్రాలలో వివిధ కథానాయకుల సరసన నటించినా, తన నటనకు గుర్తింపుతెచ్చిన చిత్రాలు కె.ప్రత్యగాత్మగారి భార్యాభర్తలు (1961) మరియు కులగోత్రాలు (1962). భార్యాభర్తలులో అభిమానం గల టీచరు శారదగా ఆమె చూపిన నటన ముఖ్యంగా శోభనం గదిలో భర్త సమీపించినప్పుడు చూపిన అసహనం, ఆ తరువాత వేడుకలో పాల్గొని ‘ఏమని పాడిదనో యీ వేళ’ అన్న వీణ పాట పాడినప్పుడు చూపిన భావాలు శ్రీశ్రీ పాట భావానికి చక్కని రూపాన్నిచ్చాయి. క్లిష్టమైన పాత్రకు న్యాయం చేసి పరిశ్రమ చేత ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు. మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 150 సినిమాలలో నటించింది. వీనిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే, 15 కన్నడ చిత్రాలు మరియు కొన్ని తమిళ భాషా చిత్రాలు. మూడు భాషల చిత్రాల్లోనూ ఆమే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈమె ఆనాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, కృష్ణంరాజు, జగ్గయ్య, హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది. కాంతారావుతో కలిసి 28 జానపద చిత్రాల్లో నటించింది. కృష్ణకుమారి జయంతి సందర్భంగా నివాళులు.

తెలుగు సినిమా సంగీతాన్ని దిగంతాలకు వ్యాపింపజేసిన వారిలో పెండ్యాల నాగేశ్వరరావు ఒకరు. పెండ్యాల సంగీతం ఆపాత మధురంగా.. పరవశించి పాడుకునేలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే… చిత్ర సంగీత సమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. పెండ్యాల గారు సినీ జీవితాన్ని ప్రారంభించిన మొదట్లో తల్లిప్రేమ (1941), సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా పనిచేశారు. స్వతంత్రంగా సంగీత దర్శకుడిగా పని చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ… ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకుందామన్న తలంపుతో సాలూరు రాజేశ్వరరావు వద్ద సహాయకులుగా చేరారు. అలా సాలూరు వారి వద్ద విదేశీ సంగీతాన్నీ, హిందుస్తానీ పోకడల్నీ తీసుకుని మన రాగాలతో మిళితం చేసి ‘తెలుగుపాట’లా శ్రవణానందంగా ఉండేలా తీర్చారు. పెండ్యాల గారు సంగీతాన్ని అందించిన సినిమాలు దొంగరాముడు, ముద్దుబిడ్డ, భాగ్యరేఖ, జయభేరి, మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణార్జున యుద్ధం, రాముడు భీముడు, శ్రీ కృష్ణ తులాభారం వంటివి చాలు పెండ్యాల సంగీత గరిమను అంచనా వేయడానికి. పెండ్యాలగారి తండ్రి సీతారామయ్యగారు సంగీతం గురువు కావడంతో.. హార్మోనియమ్‌ వంటివి ఈజీగా నేర్చుకున్నారు. చిన్నప్పుడే తండ్రిగారి వద్ద శాస్త్రీయమైన గాత్ర సంగీతాన్నీ నేర్చుకున్నారు. దాంతో చిన్నప్పటి నుండే సంగీతం పట్ల శ్రద్ధ, ఆసక్తి నాగేశ్వరరావుని రంగస్థలనటుణ్ని చేశాయి. ఇంకా పదమూడేళ్ల వయసులోనే వేషాలు కూడా వేశాడు. శ్రీకృష్ణతులాభారంలో జాంబవతి పాత్రలో నటిగా రంగస్థల జీవితాన్ని ఆరంభించారు. అంతటితో ఆగకుండా.. 1966లో డి.రామానాయుడు తీసిన శ్రీకృష్ణతులాభారం చిత్రంలో పామరుల భాషలో ఆ చిత్రంలోని పాటల్నీ, పద్యాల్నీ ఆయన అద్భుతంగా స్వరపరిచారు. సినిమాలోని సన్నివేశాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా ట్యూన్‌ వచ్చేవరకూ.. ఒడిసిపట్టుకొని అనుకున్న విధంగా గాయనీ గాయకుల చేత పాడించడం పెండ్యాల నైజం. ఘంటసాలకీ, పెండ్యాలకీ ఒకరి మీద మరొకరికి అమితమైన అభిమానం. పెండ్యాల గారి దృష్టిలో ఘంటసాలని మించిన గాయకుడు లేడు అంటారు. పెండ్యాల సంగీతంలో తెలుగుదనం అలముకొని ఉంటుంది. అది సంగీతరస హృదయులకీ, గాయనీ గాయకులకీ ఆమోదయోగ్యంగా అంతా మెచ్చేలా ఉండే సంగీతం ఆయన సొంతం. ఈరోజు పెండ్యాల జయంతి సందర్భంగా వారికిదే ఘన నివాళి.

కస్తూరి శివరావు (6 మార్చి, 1913 – 1966) ప్రముఖ తెలుగు నటుడు. నాటకరంగం, మరియు సినిమా రంగంలో ప్రముఖుడు. తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్ గా పరిగణింపదగినవాడు. తెలుగు సినీ హాస్యనటుల్లో ప్రముఖులైన రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ల కన్నా ముందు తరం వాడు. టాకీ చిత్రాలు రంగప్రవేశం చేయక ముందు మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు. శివరావు 1913లో మార్చి 6న కాకినాడలో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. చిన్నతనంలో చదువుమీద తప్ప మిగతా అన్నింటిలో ఆసక్తి చూపించేవాడు. హార్మోనియం లాంటి పలు వాయిద్యాలు వాయించేవాడు. మంచి గాత్రంతో పద్యాలు, పాటలు పాడేవాడు. శివరావు తండ్రి దగ్గర చదువుకుని సినీ రంగంలో అడుగు పెట్టిన సి. పుల్లయ్యను సంప్రదించి తన కొడుకును దారిలో పెట్టమన్నాడు. శివరావు నాటకాల్లో హాస్యపాత్రలు ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు. హాస్యం మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్‌ రికార్డులుగా ఇచ్చాడు. వరవిక్రయం (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు. చూడామణి (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం జనం దృష్టిలో పడ్డాఅడు. తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా, స్వర్గసీమ (1945) తో ఇంకా బాగా తెలిసాడు. బాలరాజు (1948) ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అందులోని శివరావు నటనా, అతని పాటలూ ప్రేక్షకజనాన్ని బాగా ఆకర్షించాయి. ఆ దశలోనే వచ్చిన గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి ( అన్నీ 1949 విడుదలలే! ) మొదలైన చిత్రాలు పెద్ద హిట్లు కావడంతో శివరావును ప్రజలు అద్భుత హాస్య నటుడిగా కొనియాడారు. సినిమాలు, ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళ్ళితే, శివరావు వెంటా, దగ్గరా మాత్రం ఎక్కువమంది జనం గుమిగూడి కనిపించేవారు. గుణసుందరి కథలో శివరావుది ప్రధాన పాత్ర. ఆ చిత్రంలోని ఆయన గిడిగిడి అనే ఊతపదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 1950 లో శివరావు సొంతంగా సినిమా కంపెనీ ఆరంభించి, పరమానందయ్య శిష్యుల కథ హాస్య నటులతో తీసాడు. నాగేశ్వరరావు హీరో కాగా, హీరోయిన్‌గా, గిరిజను పరిచయం చేశాడు. అతనే దర్శకత్వం వహించాడు. శివరావు చివరి దశలో వ్యసనాలకు బానిస అయ్యాడు. అనారోగ్యంతో వుండి, శక్తి లేకపోయినా నాటకాల్లో వేషంవేస్తే గానీ పొట్ట గడిచేది కాదు. చివరిసారిగా 1966లో అతను ఒక నాటకంలో వేషం వెయ్యడానికి తెనాలి వెళ్ళి, అక్కడే రైల్వే స్టేషనులో మరణించాడు. కొన్ని గంటల తరువాత ఎవరో ప్రయాణీకుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు. చివరకు అద్దె కారు డిక్కీలో పడి మద్రాసు చేరుకున్నాడు – మధ్యలో ఇబ్బందులు పడుతూ. వస్తూ వస్తూ ఎక్కడో కారు ఆగిపోవడంతో, మూడు రోజులపాటు ప్రయాణం చేసి శివరావు మృతదేహం ఇల్లు చేరుకుంది. సినిమా పరిశ్రమలోని అందరికీ అతని మరణ వార్త తెలిసింది. స్టార్‌డమ్ లో లేడనో, గ్లామర్‌ లేదనో మొత్తానికి ఎరిగినవాళ్ళే చాలామంది చివరిచూపు లకు రాలేదు.

మణిరామన్ (జనవరి 1, 1971 – మార్చి 6, 2016) భారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. ఆయన కళాభవన్ మణి గా సుప్రసిద్ధులు. ఆయన మిమిక్రీ కళాకారునిగా కెరీర్ ను కళాభవన్ బృందంతో ప్రారంభించాడు. ఆయన సుమారు 200 సినిమాలలో నటించాడు. వాటిలో మలయాళం, తమిళం మరియు తెలుగు సినిమాలున్నాయి. ఆయన ముఖ్యంగా ప్రతినాయకుని పాత్రలకు పోషించాడు. ఆయనకు జాతీయ ఫిలిం ఫేర్ అవార్డు మరియు కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులు 1000 లో వచ్చాయి. ఈయన ఒక నటుడుగానే కాకుండా జానపద గీతాలను ఆలపించడంలో కూడా పేరు సంపాదించాడు. దాదాపు దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల చిత్రాల్లో ఆయన విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించాడు.

తెలుగులో అవకాశాలు అందుకోవడమే కాకుండా… భాషపై ప్రేమ పెంచుకొని, తొలి అడుగుల్లోనే తెలుగు నేర్చుకున్న కథానాయిక ఇషాచావ్లా. ‘ప్రేమకావాలి’ అంటూ తెలుగు తెరపైకి దూసుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా పరిచయమైన ఆ చిత్రంతో ఇషాకి కూడా మంచి పేరొచ్చింది. దాంతో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. సునీల్‌తో కలిసి ‘పూలరంగడు’లో నటించి మరో విజయాన్ని అందుకొంది. ఆయనతోనే రెండోసారి ‘మిస్టర్‌ పెళ్లి కొడుకు’ చిత్రంలో నటించింది. ఆరంభంలో మంచి అవకాశాలే అందుకున్నప్పటికీ, విజయవంతంగా కెరీర్‌ని నిర్మించుకోవడంలో మాత్రం విఫలమైంది. తెలుగు భాషపై తొందరగానే పట్టు పెంచుకొని చక్కగా మాట్లాడేసింది. తెలుగమ్మాయే అనే భావనని ప్రేక్షకుల్లో కలిగించింది. కానీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. బాలకృష్ణ సరసన ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించినా ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసింది. అల్లరి నరేష్‌తో కలిసి నటించిన ‘జంప్‌జిలానీ’ కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దాంతో ఆ చిత్రం తరువాత ఆమె తెలుగులో కనిపించలేదు. కన్నడలో ఓ చిత్రం చేసినా… ఆ తరువాత అక్కడ కూడా పెద్దగా అవకాశాలు అందలేదు. దిల్లీలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ పొలిటికల్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. కళాశాలలో చదువుతున్నప్పుడే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత నాటక రంగంలోకి ప్రవేశించింది. తొలినాళ్లల్లో పలు ప్రకటనల్లో మెరిసిన ఆమె, అనంతరం ముంబైలోని బారీ జాన్‌ యాక్టింగ్‌ స్టూడియోలో శిక్షణ తీసుకొని సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఇషా బుద్ధిజంను అనుసరిస్తుంది. బుద్ధిస్ట్‌ సంస్థ అయిన సోకా గక్కాయ్‌ ఇంటర్నేషనల్‌ లో ఆమె సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఈ రోజు ఇషాచావ్లా పుట్టినరోజు.

శర్వానంద్ ( జననం 1984 మార్చి 10) ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు. గమ్యం, ప్రస్థానం చిత్రాలలోని నటనకు విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇతడు తమిళంలో కూడా నటించాడు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో ఆ తరవాత ‘సంక్రాంతి’, ‘లక్ష్మి’ సినిమాల్లో వెంకటేష్ తమ్ముడిగా చేశాడు. ‘రాజు మహారాజు’లో మోహన్‌బాబుతో కలిసి నటించాడు. పెద్ద హీరోల సినిమాలు చూసేవాళ్లు ఎక్కువ. వాళ్లతో నటించడం వల్ల ఇతడిని గుర్తుపట్టే వాళ్ల సంఖ్యా పెరిగింది. దీంతో మంచి పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘సంక్రాంతి’ తరవాత ‘వెన్నెల’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఓ రకమైన సైకో పాత్ర అది. ఇతడు అన్ని రకాల పాత్రలూ చేయగలనని నిర్మాతలకు నమ్మకం కలిగించిన సినిమా అది. ఆ తరవాత వచ్చిన ‘అమ్మ చెప్పింది’లో మానసికంగా ఎదగని కుర్రాడి పాత్ర. ఇతడు చేసిన వాటిల్లో చాలా కఠినమైంది అదే అని ఇతని అభిప్రాయము. ‘గమ్యం’తో ఇతని నట జీవితము పూర్తిగా మారిపోయింది. ‘గమ్యం’ తమిళ రీమేక్‌లోనూ నటించాడు. అక్కడా మంచి పేరుతో పాటు అవకాశాలొచ్చాయి. వాటిలో జర్నీ తెలుగు మరియు తమిళము రెండు భాషల్లోనూ అది విజయవంతమైనది.2014 లో వచ్చిన రన్ రాజా రన్ చిత్రంతో శర్వానంద్ ఒక స్టార్ గా ఎదిగాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు(2015) తో మళ్ళీ తన నటన తో మంచి మార్కులు సంపాదించాడు.2016 లో వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా చిత్రం లో మాస్ కారెక్టర్ చేసి యూత్ లో మoచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.2017 లో శతమానం భవతి సినిమా తో మరొక భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.2017 వేసవి లో వచ్చిన రాధ సినిమా నిరాశ పరిచినా తన నటన తో ఆకట్టుకున్నాడు. అలాగే మారుతి దర్శకత్వం లో మహానుభావుడు చిత్రం లో నటించాడు.