Politics

కోర్టుకు వెళ్లేది లేనిది అప్పుడు తేలుస్తా

Ashok Gajapati Raju Speaks On His Dismissal From MANSAS Trust

మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నియామకంలో ప్రభుత్వ తీరును టీడీపీ సీనియర్ నేత అశోక్‌ గజపతిరాజు తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వ తీరు వింతగా ఉందని వ్యాఖ్యానించారు. చైర్మన్‌గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయని తెలిపారు. అయినా ప్రభుత్వ జీవోను ఇప్పటివరకు బయటపెట్టలేదని చెప్పారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ పరిధిలో 105 ఆలయాలు ఉన్నాయని వెల్లడించారు. ట్రస్ట్‌, దేవాదాయ భూములపై ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు. దాతల భూములు ఆలయాలకే చెందాలని అశోక్‌ గజపతిరాజు డిమాండ్ చేశారు. ట్రస్ట్‌ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని అశోక్‌ గజపతిరాజు హితవు పలికారు. ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయొద్దని సూచించారు. మాన్సాస్‌ చైర్మన్‌ పదవి మార్పు వింతగా ఉందన్నారు. భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని పేర్కొన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో దేవాదాయ శాఖ అధికారులతోనే… నిర్వీర్యం చేయడానికి కొన్నాళ్లుగా ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు మారినా… ఇలాంటి సమస్యలు రాలేదని వాపోయారు. రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని తెలిపారు. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి తొలగించారన్నారు. జీవో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా?… ఏ విధమైన పోరాటం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్ల పరిశ్రమలు, పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారని అశోక్‌ గజపతిరాజు వ్యాఖ్యానించారు