Movies

విడాకులు వింతగా చూశారు

Diya Mirza Speaks Of Her Divorce Issues

తన భర్త సాహిల్‌ సంఘా నుంచి విడాకులు తీసుకున్నప్పుడు చాలా మంది తనని చాలా వింతగా చూశారని అంటున్నారు నటి దియామీర్జా. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు తెలిసినంత వరకూ ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే.. నిన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడే వాటిని ఎదుర్కొనే ధైర్యం నీకు వస్తుంది. నిన్ను నువ్వు అర్థం చేసుకోనప్పుడు మన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతుందో కూడా నువ్వు గుర్తించలేవు’ అని దియా మీర్జా తెలిపారు. అనంతరం ఆమె.. విడాకుల తర్వాత కొంతమంది తనతో ఎలా ప్రవర్తించారో చెబుతూ.. ‘‘విడాకుల తర్వాత కొంతమంది నాతో ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంటుంది. కొంతమంది చదువుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో పరిణతి చెందలేకపోతున్నారు. కొంతమంది నన్ను చాలా వింతగా చూసేవారు. జీవితంలో నాలాగే ఇబ్బందులు ఎదుర్కొన్న కొంతమంది మహిళలు నాకు మెస్సేజ్‌లు చేసేవారు. ‘విడాకులు తీసుకున్నప్పటికీ మీరు ఇంత స్ట్రాంగ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? ఎలా నవ్వగలుగుతున్నా‌రు? ప్రశాంతంగా నిద్రలేచి వర్క్‌కి ఎలా వెళ్లగలుగుతున్నారు‌?’ అనే సందేశాలు నాకు వస్తుండేవి. వాళ్ల కోసం నా దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ‘నా దారి నేను చూసుకున్నాను. అలాగే మీరు కూడా మీ దారి చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీ జీవితానికి ఏది అనువైన దారి అనేది నేను చెప్పలేను.’ అని సమాధానం చెప్పేదాన్ని’’ అని దియా మీర్జా పేర్కొన్నారు.