Politics

తెలంగాణాలో లక్ష ఉద్యోగాలు ఇచ్చాము

KCR Speaks In Legislative Council Over Jobs In Telangana

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 57 ఏళ్లకే పింఛను ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. శనివారం సాయంత్రం శాసనమండలిలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తామని నేనెక్కడా చెప్పలేదు. ఏపీ నుంచి తెలంగాణ విడిపోతే మనకు లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. ఇప్పటికే దాదాపు లక్ష ఉద్యోగాలు ఇచ్చాం. ఐటీ రంగంలో హైదరాబాద్‌లో 7లక్షల మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించి లక్షల మంది బతుకుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో నిరుద్యోగ సమస్య ఉంది. మన వద్ద లేబర్‌ పదానికి సరైన నిర్వచనం లేదు. కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? లేనిది ఉన్నట్టు యువతను మభ్యపెట్టొద్దు. ‘‘రాష్ట్రంలో పరిస్థితిని యువతకు చెప్తాం. ఏ రంగంలో ఉద్యోగావకాశాలు ఉన్నాయో వారికి తెలియజేస్తాం. డిఫెన్స్‌, బ్యాంకింగ్‌, రైల్వే రంగాల్లోకి మన యువత వెళ్లడంలేదు. యువతకు సరైన శిక్షణ ఇచ్చి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రైతు వేదికల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని చెప్పాం. రైతులు సంఘటితమైతే.. చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. 12,751 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌, ట్యాంకర్‌, ట్రాలీలు ఇచ్చాం. వీటిని సద్వినియోగం చేసుకొని పచ్చదనాన్ని పరిరక్షించాలి’’ అని కేసీఆర్‌ కోరారు. ‘‘రాష్ట్రంలో జరిగిన దిశ ఘటన చాలా బాధాకరం. మహిళలకు షీటీమ్స్‌ రక్షణ కల్పిస్తున్నాయి. అటవీ భూములు పోయాయి.. ఉన్న చెట్లు నరికేశారు. గతంలో ఉన్న చెట్లు నరికేశారే తప్ప కొత్తవి నాటలేదు. పర్యావరణం కోసం ఈ ఏడాది రూ.2,180 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. కంటి వెలుగు పథకం కింద 1.5కోట్ల మందికి కంటి పరీక్షలు చేశాం. రాష్ట్రంలో కరోనా కోసం మందులు, మాస్క్‌ అవసరంలేదు. తెలంగాణలో కరోనా వైరస్‌ లేదు.. రాదు. ప్రజలను అనవసరమైన భయాలకు గురిచేయకండి’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.