వెన్నుతట్టే స్నేహితులు నలుగురుంటే ఏదైనా చేయగలం అనిపిస్తుంది. అందుకే చదువు, ఉద్యోగం ఇలా ప్రతి విషయంలో ఆప్తమిత్రుల సలహాలు తీసుకుంటారు చాలామంది. ఉద్యోగం చేసే మహిళలకు మంచి స్నేహితుల తోడ్పాటు ఉంటే వారు ఉన్నతస్థాయికి చేరతారు. వారి ప్రగతికి అలాంటి స్నేహహస్తం బాసటగా నిలుస్తోందని అంటోంది తాజా అధ్యయనం. ఫ్రెండ్స్ మద్దతు, ప్రోత్సాహం ఎక్కువగా ఉన్న ఉద్యోగినులు వృత్తిజీవితంలో మెరుగైన ప్రదర్శన చేస్తారని హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో వచ్చిన కథనం చెబుతోంది.. అడుగడుగునా వెన్నుతట్టే ఆడ స్నేహితులు ఉన్న మహిళలు మంచి ఉద్యోగం సాధిస్తారని, తమ కెరీర్‌లో దూసుకుపోతారని, ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పరిశోధకులు అంటున్నారు. మగ ఉద్యోగులతో పోలిస్తే పనిప్రదేశంలో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలు భిన్నమైనవి. సమాన వేతనం లభించకపోవడం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు వంటివి వాటిలో ప్రధానమైనవి. అయితే వృత్తిజీవితంలో ఉన్నత స్థాయికి చేరిన మహిళలు తోటి ఉద్యోగినులకు ఈ రకమైన సమస్యల నుంచి బయటపడే మెలకువలు నేర్పుతారు. అంతేకాదు ప్రొఫెషనల్‌గా మంచి స్థాయిల్లో ఉన్నవారు నమ్మకమైన ఆడ స్నేహితుల సాయం తీసుకోవడానికి ఆలోచించరు. మగవాళ్లకన్నా మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న టీమ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం, పనితీరు మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొనే మహిళలకు స్నేహితురాళ్ల మానసిక మద్దతు లభిస్తే తొందరగా బయటపడతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
స్నేహమే శిఖరానికి చేరుస్తుంది
Related tags :