కథానాయిక తాప్సి నటించిన ‘థప్పడ్’ సినిమా కథ తనకు విచిత్రంగా అనిపించిందని దర్శకుడు అహ్మద్ ఖాన్ అన్నారు. నలుగురి ముందు భర్త తనపై చేయిచేసుకోవడంతో భార్య విడాకులు తీసుకునే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ అందుకుంది. కాగా ‘బాఘి 3’ ప్రచారంలో అహ్మద్ ఖాన్ ‘థప్పడ్’ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘థప్పడ్’ సినిమా కాన్సెప్ట్ నాకు చాలా కొత్తగా అనిపించింది. భర్త ఓ చెంపదెబ్బ కొట్టాడనే కారణంతో భార్య అతడి నుంచి జీవితాంతం దూరంగా ఉండాలి అనుకునే కథ నాకు అర్థం కాలేదు. భర్త కొట్టడం కోపాన్ని తెప్పిస్తే.. తిరిగి రెండు దెబ్బలు కొట్టాలి. అంతేకానీ భార్య ఇలా చేస్తుందా?’.
‘నేనెప్పుడైనా నా భార్యను చెంపదెబ్బ కొడితే.. ఆమె తిరిగి నన్ను కొట్టొచ్చు. ఆ గొడవ అక్కడితే అయిపోతుంది. నీతో కలిసి నేను బతకలేను అని నేనంటే.. ఆమె కూడా అలా అనొచ్చు. కానీ భార్యాభర్తలు కలిసి ఉండగలరా? లేదా? అనే విషయాన్ని కేవలం ఓ చెంపదెబ్బ నిర్ణయిస్తుందా..?’ అని ఆయన ప్రశ్నించారు.
అహ్మద్ ఖాన్ వ్యాఖ్యలపై తాప్సి స్పందించారు. ఆయన కామెంట్లకు స్పందించాల్సిన అవసరం ఉందని అనుకోవడం లేదని అన్నారు. ‘ఆయనకి సరైంది అనిపించిన కథలతో సినిమాలు తీస్తారు. మేం కూడా అంతే. ఎవరి కథ ఎలాంటిదైనప్పటికీ చివరికి ప్రేక్షకుడు దానిపై తీర్పు ఇస్తాడు. ఓ బంధంలో ప్రేమ, గౌరవం ఉండటాన్ని మనం చూశాం. కానీ ‘థప్పడ్’లాంటి బంధాలు కూడా ఉంటాయి. ఖాన్ ఆయనకి సౌకర్యంగా ఉన్న సినిమాలు చేస్తున్నారు. మేం కూడా మాకు సౌకర్యంగా అనిపించినవే తీస్తున్నాం’ అని చెప్పారు.