టిటిడికి అనుబంధ ఆలయమైన నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాలు మార్చి 23 నుండి 27వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
శ్రీమహావిష్ణువు మత్స్యావతార రూపంలో సంవత్సరాల పాటు యుద్ధం చేసి వచ్చినందున, స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేయడమే సూర్యపూజోత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో గల మూలవిరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపైన, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయి.
సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు భక్తులకు సూర్యపూజ దర్శనం కల్పించనున్నారు. రాత్రి 7.30 గంటల నుండి 9.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది.
మార్చి 23 నుండి తెప్పోత్సవాలు :
శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 23 నుండి 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్పవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు, రెండవ రోజు గోదాదేవి సమేత వేదనారాయణస్వామివారు, మూడవ రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, నాలుగు, ఐదో రోజుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేదనారాయణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. తెప్పోత్సవాల అనంతరం మొదటి మూడు రోజులు స్వామి, అమ్మవార్ల (తిరుచ్చి) తిరువీధి ఉత్సవం, నాల్గవ రోజు సర్వభూపాల వాహనం, ఐదవ రోజు గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
మార్చి 27న మత్స్య జయంతి :
శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 27వ తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది.
ఈ సందర్భంగా ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి, తోమాల, అర్చన నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారికి మత్స్య జయంతి ఉత్సవం(తిరువీధి ఉత్సవం) నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు శాంతిహోమం, ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 9 నుండి 12 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.