Movies

దెయ్యాల కొంప

Anushka Nissabdham Movie

దెయ్యాల కొంప అనే పేరున్న ఓ విల్లా మరోసారి వార్తల్లోకి వచ్చింది. అది ఎందుకు? ఆ ఇంటికి ఆ పేరు ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే ‘నిశ్శబ్దం’ చూడాల్సిందే. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. మాధవన్‌, అంజలి, మైఖేల్‌ మ్యాడసన్‌, షాలినిపాండే ప్రధాన పాత్రలు పోషించారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్‌, కోన వెంకట్‌ నిర్మాతలు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఏప్రిల్‌ 2న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ చిత్రంలోని కథానాయికల చిత్రాల్ని విడుదల చేశారు. సాక్షి అనే బధిర యువతిగా అనుష్క నటించగా, అంజలి అమెరికన్‌ పోలీస్‌ అధికారిగా సందడి చేయనుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. భయానకమైన సంఘటనలు చోటు చేసుకుంటున్న ఓ ఇంట్లో ఏముందనే పోలీసుల పరిశోధన నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. ‘అక్కడ చీకట్లో ఎవరో ఎటాక్‌ చేశారంట… కానీ ఎవరో ఏంటో కనిపించలేదంటున్నారు’, ‘ఒక దెయ్యం ఇదంతా చేసిందని యాక్సెప్ట్‌ చేయడానికి నా సెన్సిబిలిటీస్‌ ఒప్పుకోలేదు’ అంటూ కొన్ని సంభాషణలు వినిపిస్తాయి. సుబ్బరాజు, శ్రీనివాస్‌ అవసరాల, హంటర్‌ ఓ హరో తదితరులు నటించారు. సంగీతం: గోపీసుందర్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: షానియల్‌ డియో.