రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేసే అన్నింటినీ తొలగించడం ఆనవాయితీ అని.. ఇప్పటి వరకు ఎక్కడా ఆ ప్రక్రియ చేపట్టలేదని ఆయన విమర్శించారు. ఇష్టారీతిన రిజర్వేషన్లు, సరిహద్దులు మారుస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన రిజర్వేషన్లు మార్చేస్తారా? అని ప్రశ్నించారు. తమ అభ్యర్థులను జైల్లో పెట్టినా స్థానిక ఎన్నికల్లో తెదేపా పోటీ చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు వైకాపాకు ఒక్క ఛాన్స్ ఇస్తే కండకావరం ప్రదర్శిస్తోందని.. మళ్లీ గెలిస్తే ఆస్తులు కూడా మిగలవని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 90 శాతం స్థానాలు గెలిపించుకోవడమంటే నిబంధనలు ఉల్లంఘించి కండకావరం ప్రదర్శించడమేనని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. నోటిఫికేషన్ ఇచ్చి ఇంట్లో కూర్చోవడంతో ఎన్నికల సంఘం పని అయిపోయినట్లు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లు
Related tags :