దేశంలో కరోనా(కోవిడ్-19) కేసులు నమోదవుతున్నా ఐపీఎల్ నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తాజాగా చేసిన వ్యాఖ్యలపై దాదా స్పందించారు. ఈనెల 29 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ముంబయిలోని వాంఖడే వేదికగా ఆరంభ చెన్నై సూపర్ కింగ్స్ x ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌తో కలిసి ఏడు మ్యాచ్‌లు ఇక్కడ జరగనున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 42 కేసులు నమోదయ్యాయి. తమ రాష్ట్రంలో 15 మంది అనుమానితులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని, మరో 258 మందిని పంపించినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో ఒక్కరికి కూడా వైరస్ సోకినట్లు తేలలేదని స్పష్టం చేసింది. ఇటీవల ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడితే.. వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. దీంతో ఐపీఎల్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంపై అధికార వర్గాల్లోనూ చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకొని వెల్లడిస్తామన్నారు. ఈ నేపథ్యంలో గంగూలీ సోమవారం ఇండియా టుడేతో మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ యథావిథిగా జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు. అలాగే మ్యాచ్‌లు జరిగే వేళ కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కొరోనాకు భయపడి IPL ఆపలేము
Related tags :